సహకార సంఘాలపై డిసిసిబి ఒత్తిడి
2010-13 మధ్య రైతులకిచ్చిన వడ్డీ రాయితీ రూ.27.51 కోట్లు
అది తిరిగి కట్టాలని హుకుం
అవినీతి వ్యవహారాలతో డిసిసిబి క్యాష్ రేషియో 6.25కు పతనం
అది పూడ్చుకునేందుకు సహకార సంఘాలను చిదిమేసేందుకు సిద్ధం
రైతులకిచ్చిన సొమ్ము ఎలా కట్టాలని సహకార సంఘాల ఆందోళన
ఆడిట్ అభ్యంతరాలపై సమాధానమివ్వని డిసిసిబి
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
సహకార సంఘాల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చేందుకు డిసిసిబి (జిల్లా సహకార కేంద్ర బ్యాంకు) పూనుకుందా. అవినీతి వ్యవహారాలతో డిసిసిబికి వచ్చిన నష్టాలను సహకార సంఘాలపై మోపేందుకు ప్రణాళిక రచించిందా... ప్రభుత్వం నుంచి వడ్డీరాయితీ సొమ్ము రాలేదనే నెపంతో రూ.కోట్ల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా సంఘాల నుంచి వసూలు చేసేందుకు కుయక్తులు పన్నిందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. దాదాపు దశాబ్దకాలం క్రితం రైతులకిచ్చిన వడ్డీ రాయితీ సొమ్మును ఇప్పుడు సహకార సంఘాలు కట్టాలని ఉత్తర్వులు జారీ చేయడంపై సంఘాల కార్యదర్శులు, పాలక కమిటీలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
డిసిసిబి (జిల్లా సహకార కేంద్ర బ్యాంకు)కు ఉమ్మడి జిల్లాలో 34 బ్రాంచీలు ఉన్నాయి. వీటి పరిధిలో 258 సహకార సంఘాలు ఉన్నాయి. సహకార సంఘాలనేవి రైతులను అన్నివిధాలా ఆదుకునేందుకు ఏర్పడినవి. సహకార సంఘాల్లో రెండు రకాల రుణాలిస్తారు. పంట రుణాలు వంటి షార్ట్‌టర్మ్ రుణాలు, గేదెలు, గొర్రెలు, వాహనాలకు సంబంధించిన లాంగ్‌టర్మ్ రుణాలను రైతులకు అందిస్తారు. లాంగ్‌టర్మ్ రుణాలకు 11.15 శాతం నుంచి 15 శాతం వరకూ వడ్డీ ఉంటుంది. 2014 ముందు వరకూ సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు వడ్డీరాయితీ కింద ఆరు శాతం ప్రభుత్వం ఇచ్చేది. అందులో భాగంగానే జిల్లాలోని సహకార సంఘాలకు 2010-11లో రూ.4,36,85,983 కోట్లు, 2011-12కు సంబంధించి రూ.10,34,83,734 కోట్లు, 2012-13లో రూ.12,80,11,692 కోట్లు మొత్తం రూ.27,51,81,409 కోట్లు జిల్లా రైతులకు వడ్డీ రాయితీ వర్తించింది. ఈ సొమ్మును డిసిసిబి తమ పరిధిలోని సహకార సంఘాల్లోని రైతులకు వడ్దీరాయితీ సొమ్ము చెల్లించడం సైతం జరిగింది. ఇది జరిగి దాదాపు 12 ఏళ్లు కావొస్తోంది. రైతులకు తామిచ్చిన వడ్డీ రాయితీ సొమ్మును ప్రభుత్వం నుంచి రాలేదు. అందువల్ల రూ.27.51 కోట్లు సొమ్మును సహకార సంఘాలు చెల్లించాలని గత నెల 29వ తేదీన డిసిసిబి సహకార సంఘాలకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సహకార సంఘాల కార్యదర్శులు, పాలకవర్గ కమిటీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. పదేళ్ల క్రితం రైతులకిచ్చిన వడ్డీ రాయితీ సొమ్ము ఏవిధంగా సహకార సంఘాలు చెల్లిస్తాయని, అప్పట్లో వడ్డీ రాయితీ తీసుకున్న రైతులు ఇప్పుడు చాలామంది సహకార సంఘాల్లో సభ్యులుగా కూడా లేరని చెబుతున్నారు. డిసిసిబి బ్యాంకు మరో కొత్త ఎత్తుగడ వేసి ఈ సొమ్మును రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. సహకార సంఘాలకు అప్పుగా ఇస్తామని, తిరిగి చెల్లించాలని చెబుతోంది. సహాకార సంఘాలు డిసిసిబి నుంచి అప్పుగా సొమ్ము తీసుకుంటే ఆ సొమ్మును రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. మళ్లీ రైతుల నుంచి వసూలు కట్టాలి. ఇప్పుడు అప్పుగా ఇచ్చే సొమ్మును రైతులకు ఇవ్వకుండా డిసిసిబికి ఇస్తే ఆడిట్‌లో ఏవిధంగా చూపించాలని సహకార సంఘాల కార్యదర్శులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా చేస్తే సంఘం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని భయం అందరినీ వెంటాడుతోంది. పదేళ్ల తర్వాత వడ్డీరాయితీ సొమ్ము వెనక్కి తీసుకునేందుకు పూనుకోవడం వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు తెలుస్తోంది. వడ్డీ రాయితీ కింద సొమ్ము కట్టాల్సి వస్తే ప్రతి సహకార సంఘం రూ.లక్షల్లో చెల్లించాల్సి ఉంది. మచ్చుకు పరిశీలిస్తే ఆకివీడు మండలంలో ఐదు సహకార సంఘాలున్నాయి. వీటిలో వడ్డీరాయితీ కింద ఆకివీడు సంఘానికి రూ.5.56 లక్షలు, ఉండి సంఘానికి రూ.3.56 లక్షలు, పెదపుల్లేరుకు రూ.20 వేలు, చెరుకుమిల్లి సంఘానికి రూ.79 వేలు, కలవపూడి సంఘానికి రూ.47 వేలు ఇలా మొత్తం మండలంలోని సహకార సంఘాలు రూ.10.61 లక్షలు వరకూ చెల్లించాల్సి ఉంది. పెద్ద సహకార సంఘాలు మరింత ఎక్కువగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.
అవినీతి ఆరోపణల వెల్లువ.. క్యాష్ రేషియో 6.25 శాతానికి పతనం
జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పరిధిలో 34 బ్రాంచీలు ఉండగా గోపాలపురం, చాగల్లు వంటి బ్రాంచీల్లో నకిలీ బంగారం తాకట్టు వ్యవహారంతో పెద్దఎత్తున అవినీతి జరిగింది. నిడదవోలు, పాలకొల్లు, యలమంచిలి, పెనుగొండ, తాడేపల్లిగూడెం బజార్ వంటి బ్రాంచీల్లో బ్యాంకు గ్యారెంటీలతో చేసిన అప్పుల మంజూరులో పెద్దఎత్తున అవినీతి సాగినట్లు బయటపడింది. మిగిలిన బ్రాంచీల్లో పరిస్థితి ఏమిటో ఇంకా తెలియాల్సి ఉంది. బయటపడిన లెక్కల ప్రకారం దాదాపు రూ.150 కోట్లు మేర డిసిసిబి బ్రాంచీల్లో అవినీతి జరిగినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. డిసిసిబిలో అవినీతి పరాకాష్టకు చేరడంతో బ్యాంక్ క్యాష్‌రేషియో పడిపోయినట్లు తెలుస్తోంది. జిల్లా సహకార కేంద్రబ్యాంక్‌కు వర్కింగ్ క్యాపిటల్, షేర్ క్యాపిటల్, రిజర్వుడు నిధులు, సెంట్రల్ బ్యాంకు నుంచి తీసుకున్న అప్పులు వంటివన్నీ కలిపి బ్యాంక్ క్యాష్ రేషియోగా లెక్కిస్తారు. ఈ క్యాష్ రేషియో తొమ్మిది శాతం ఉండాల్సి ఉండగా అవినీతి వ్యహహారాలతో 6.25 శాతానికి పడిపోయినట్లు తెలుస్తోంది. క్యాష్ రేషియో పడిపోవడంతో డిసిసిబికి నాబార్డు నుంచి వచ్చే నిధులకు అంతరాయం ఏర్పడనుంది. దీంతో డిసిసిబికి తీవ్ర ఇబ్బందులు వచ్చిపడతాయి. ప్రభుత్వం నుంచి ఒత్తిడి తెచ్చి వడ్డీరాయితీ నిధులు తీసుకోవాల్సి ఉండగా అది వదిలేసి సంఘాలను దెబ్బతీసే విధంగా డిసిసిబి ముందుకు సాగుతుందనే విమర్శలు విన్పిస్తున్నాయి. దీనిపై వెంటనే ఉన్నతాధికారులు, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, లేకపోతే సహకార సంఘాలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని అంతా అభిప్రాయపడుతున్నారు.
చెప్పాల్సిన అవసరం లేదు
బి.శ్రీదేవి, సిఇఒ, డిసిసిబి
వడ్డీ రాయితీ సహకార సంఘాల నుంచి వసూలు చేయడంపై డిసిసిబి సిఇఒ శ్రీదేవిని ప్రజాశక్తి వివరణ కోరగా చెప్పాల్సిన అవసరం లేదని, మీకు ఎవరు చెప్పారో వాళ్లనే అడగాలంటూ సమాధానమిచ్చారు.
సహకార సంఘాల కార్యదర్శుల నుంచి వెల్లువెత్తుతున్న ప్రశ్నలు
-2013 మధ్యకాలంలో డిసిసిబి ఇచ్చిన వడ్డీరాయితీ సొమ్ము రైతులకు వెళ్లిపోయింది. సంఘం వద్ద లేదు. అంత సొమ్మును రుణంగా తీసుకుంటే ఎవరికి చెల్లించినట్లు చూపాలి. రైతులకు ఇవ్వకుండా మన దగ్గర ఉన్నట్లు చూపితే డిపార్టుమెంట్ ఆడిటర్లు ఒప్పుకుంటారా?
-2013లో లావాదేవీలకు సంబంధించి ఆడిట్ ప్రక్రియ పూర్తయింది. వాటిని ఎలా మార్చగలం. వాటికి ఆడిటర్లు ఒప్పుకుంటారా, అడిటర్లు ఒప్పుకోకపోతే డిపార్టుమెంట్ కార్యదర్శులపై చర్యలు తీసుకునే అవకాశం లేదా.. అప్పుడు ఏం చేయాలి. బ్యాంకు మనల్ని ఏ విధంగా కాపాడుతుంది?
-జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వడ్డీ రాయితీని వెనక్కి తీసుకోవాలనే విషయాలకు సంబంధించి డిపార్టుమెంట్ నుంచిగానీ, ఆప్కాబ్ లేదా నాబార్డు వారి నుంచి అనుమతులున్నాయా?
-ఆడిట్ జరిగిన అక్కౌంట్స్‌ను ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్టుమెంట్‌కు సమర్పించడం జరిగింది. ఇప్పుడు వారు ఒప్పుకుంటారా, ఒప్పుకోకపోతే డిపార్ట్‌మెంట్ నుంచి ఏవిధమైన చర్యలుంటాయి. అప్పుడు కార్యదర్శుల పరిస్థితి ఏమిటి?
-అడ్వాన్స్ షేర్ క్యాపిటల్ చెల్లించమంటున్నారు. మనం కట్టిన షేర్ క్యాపిటల్‌కే వారు వడ్డీ ఇవ్వట్లేదు. రిజిస్టర్ ఉత్తర్వులున్నా, సంఘ సభ్యుడు ఎవరైనా లోన్ క్లియర్ చేసినట్లయితే మనం వారికి షేర్ క్యాపిటల్ అడ్జెస్ట్ చేస్తున్నాం. అయితే సెంట్రల్ బ్యాంక్ మాత్రం మనం కట్టిన షేర్ క్యాపిటల్ తిరిగివ్వడం లేదు. ఇటువంటప్పుడు మన అడ్వాన్స్ షేర్ క్యాపిటల్ చేస్తే సంఘం వడ్డీ నష్టపోదా.. మనం అడ్వాన్స్ షేర్ క్యాపిటల్ చేస్తే దానికి తగ్గట్లు లోన్ ఇస్తారని నమ్మకం ఏమిటి? అంత లోన్ తీసుకోవడానికి మన దగ్గర సభ్యులుండాలి కదా? లోన్ మంజూరు ఆర్డర్ లేకుండా మీరు అంత షేర్ క్యాపిటల్ ఎందుకు కట్టారని డిపార్టుమెంట్ ఆడిటర్ అడిగితే ఏం సమాధానం చెప్పాలంటూ కార్యదర్శులు ప్రశ్నలు సంధిస్తున్నారు.










