
ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్ : వడ్డేశ్వరం గ్రామ పరిధిలోని అసైన్డ్ భూమి సర్వే నంబర్ 40లో ఇళ్లేసుకున్న ఎస్సీ కాలనీలో పేదలకు మౌలిక వసతులు కల్పించాలని, పేదల ఇళ్లను రెగ్యులర్ చేసి, పట్టాలు ఇవ్వాలని సిపిఎం సీనియర్ నాయకులు జొన్న శివశంకరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామంలోని ఎస్సీ కాలనీలో సిపిఎం మండల కార్యదర్శి డి.వెంకటరెడ్డితో కలిసి ఆయన ఆదివారం పర్యటించారు. కాలనీలో మౌలిక వసతులపై స్థానికుల నుండి వివరాలడిగారు. ఈ సందర్భంగా శివశంకరరావు మాట్లాడుతూ 16 ఏళ్లుగా నిరుపేదలు ఇళ్లేసుకుని జీవిస్తుంటే గత టిడిపి ప్రభుత్వం కానీ, ప్రస్తుతం వైసిపి ప్రభుత్వం కానీ పేదల ఇళ్లను రెగ్యులర్ చేసి పట్టాలివ్వకుండా తాత్సారం చేశాయని విమర్శించారు. సరైన రోడ్లు, డ్రెయినేజీ కాల్వలు లేకపోవడం వల్ల ఎక్కడి మురుగు అక్కడే నిలిచిపోయి, దోమలతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని వాగ్దానం చేసిన జగన్మోహన్‌రెడ్డి ఒక్క సెంటు స్థలం కూడా పేదలకు ఇవ్వలేదని అన్నారు. మూడు రాజధానుల పేరుతో రాజకీయం చేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు. డి.వెంకటరెడ్డి మాట్లాడుతూ తాడేపల్లి మండలంలో సుమారు మూడు వేల మందికి పైగా ఇల్లు లేని నిరుపేదలున్నారని, వీరిని టిడిపి, వైసిపి రెండూ విస్మరించాయని చెప్పారు. ఇల్లు లేని పేదలు పిడబ్ల్యూడి కాల్వ కట్టలు, కొండ పోరంబోకు, చెరువు పోరంబోకులలో ఇళ్లేసుకున్న పేదలందరికీ, పేదలు నివాసం ఉండే చోటే ఇళ్లను రెగ్యులర్ చేసి, పట్టాలివ్వాలని కోరారు. గ్రామాల్లో పేదలు ఎదుర్కొంటున్న తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీ కాల్వలు, మురుగు, ఇతర సమస్యలపైనా మంగళగిరిలోని ఎంటిఎంసి కార్యాలయం వద్ద సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో మహాధర్నా చేస్తామని, ప్రజలు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం వడ్డేశ్వరం గ్రామ శాఖ కార్యదర్శి వి.పున్నయ్య, ఎస్కే కాసింబి, కె.సాంబశివరావు, వి.మరియబాబు, కె.స్వాతి, భ్రమరాంబ, ప్రసన్నదేవి, ఆగేసమ్మ పాల్గొన్నారు.
ఎంటిఎంసి కార్యాలయం వద్ద నేడు సిపిఎం ధర్నా
ప్రజాశక్తి - మంగళగిరి : ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎంటిఎంసి కార్యాలయం వద్ద ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్ చెంగయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన జారీ చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో 20 వేల మంది ఇళ్ల స్థలాలు, పట్టాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల్లో ఇళ్లేసుకుని నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇస్తామని, రెగ్యులరైజ్ చేస్తామని జీవోలు ఇవ్వడం మినహా చర్యలు మాత్రం లేవని పేర్కొన్నారు. గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీ సమస్యలతో జనం సతమతమవుతన్నారని తెలిపారు. డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల భూగర్భ జలాలు, పంట కాల్వలు కలుషితం అవుతున్నాయని, భూగర్భ డ్రెయినేజీ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అన్ని గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన స్థలాల సమస్య ఉందని, ఇటీవల సిపిఎం నిర్వహించిన పాదయాత్రలో ప్రజలు అనేక సమస్యలను తమకు నివేదించారని తెలిపారు. ఈ సమస్యలపై చేపట్టే ధర్నాలో ప్రజలంతా పాల్గొనాలని కోరారు.