Apr 20,2023 00:02

గోవర్థనరావు మృతదేహం వద్ద రోదిస్తున్న కుమార్తె

ప్రజాశక్తి- వడ్డాది
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం, వడ్డాది గ్రామానికి చెందిన దొండా గోవర్ధనరావు (55) బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు వడగాల్పులకు తట్టుకోలేక మృతిచెందాడు. వ్యవసాయ కూలి పనికి వెళ్లి ఇంటికి వచ్చిన గోవర్ధనరావు ఎండ వేడికి తట్టుకోలేక కుప్పకూలి మృతిచెందాడు. గోవర్థనరావు భార్య సత్యవేణి కేన్సర్‌ వ్యాధితో మూడేళ్ల క్రితం మృతిచెందారు. గోవర్థనరావు తల్లి మూడు నెలల క్రితం మరణించింది. మృతునికి 18 సంవత్సరాల కుమార్తె స్వాతి ఉంది.
కూలిపనికి వెళ్లి ఇంటికి వచ్చిన గోవర్థనరావు మంచినీరు తీసుకురమ్మని కుమార్తెను అడిగాడు. కుమార్తె లోపలికి వెళ్లి నీరు తెచ్చేసరికి కిందపడి ఉన్నాడు. తండ్రి కింద పడటం చూసి ముఖంపై కుమార్తె స్వాతి నీరు చల్లింది. అయినా లేవకపోవడంతో తండ్రికి ఏమైందోనని కుమార్తె స్వాతి ఏడవడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. తండ్రి మృతిచెందినట్లు వారంతా చెప్పేసరికి స్వాతి రోధనను ఆపడం ఏవరి తరమూ కాలేదు. గతంలో తల్లిని, ఇప్పుడు తండ్రిని దూరం చేశారు, ఇప్పుడు తాను ఎక్కడ ఉండాలి, ఎలా బతకాలి అంటూ రోధించడంతో అక్కడ ఉన్న వారంతా కంట తడిపెట్టారు. అంత్యక్రియలలో తండ్రికి స్వాతి తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది.