ప్రజాశక్తి-పంగులూరు: వేసవికాలం, ఎండలు మండుతుండటం వలన మండల ప్రజలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ మల్లికార్జున్‌రావు, డాక్టర్ శివ చెన్నయ్య కోరారు. మండలం లోని తూర్పు కొప్పెరపాడు, చందలూరు గ్రామాల్లో వేసవికాలంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి మంగళ వారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇళ్ల నుంచి బయటకు వెళ్లవలసి వస్తే, గొడుగు తప్పనిసరిగా వేసుకొని వెళ్లాలని, పనికి వెళ్లేవారు తలకు టవల్ చుట్టుకుని వెళ్లాలని కోరారు. బండి మీద వెళ్లేవాళ్లు హెల్మెట్ తప్పకుండా పెట్టుకోవాలని, ఎండ తగలకుండా టోపీలు ధరించాలని అన్నారు. వెళ్లేటప్పుడు అందరూ వాటర్ బాటిల్స్‌ను తప్పనిసరిగా తీసుకొని, తరచూ మంచినీళ్లు తాగాలని, నీరసంగా ఉంటే, ఏఎన్‌ఎం దగ్గర ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు తీసుకొని వాడాలన్నారు. పనులను ఉదయం 11 గంటలలోపు పూర్తి చేసుకోవాలని, సాయంత్రం నాలుగు గంటల తర్వాత వాతావర ణం చల్లబడిన తర్వాత బయటకు రావాల న్నారు. కొబ్బరినీళ్లు, మజ్జిగ, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలని డాక్టర్ మల్లికార్జున రావు, శివ చెన్నయ్య కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు జానకి, లలిత, సిహెచ్‌ఓలు విష్ణువర్ధన్, వాణి, 104 సిబ్బంది వినీత్, ప్రతాప్, సతీష్ కుమార్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.










