Jan 11,2023 23:48

వడ్డాదిలో చెత్తా పోగుపడి, మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతంలో సంచరిస్తున్న పందులు

ప్రజాశక్తి- బుచ్చయ్యపేట
మండలంలోని వడ్డాదిలో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. వీధివీధిలోనూ దోమలు రరు మంటూ ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. ఉదయం, రాత్రి అన్న తేడా లేకుండా దోమలు విజృంభించడంతో జనానికి కంటి మీద కునుకు లేకుండా ఉంది. అయినా అధికారులకు పట్టడం లేదు. ప్రధానంగా వడ్డాదిలో అపారిశుధ్యం తాండవిస్తోంది. ఎక్కడి చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు ఎక్కడికక్కడ నిల్వ ఉంటుంది. వీటిని తొలగించే చర్యలు పంచాయతీ అధికారులు, పాలకవర్గం చేపట్టడం లేదు. పైలా ఇక్కడ ఫ్యాగింగ్‌ కూడా చేయలేదు. దీంతో దోమలు వృద్ధి చెంది స్వైర విహారం చేస్తున్నాయి. స్థానికులకు కంటిమీద కునుకు ఉండడం లేదు. జనం నానా అవస్థలు పడుతున్నా అటు ప్రజా ప్రతినిధులు గాని, ఇటు అధికార యంత్రాంగం గాని పట్టించుకోవడం లేదని జనం మండి పడుతున్నారు. జనం ఇప్పటికే ఆస్పత్రుల పాలవుతున్నారు. దోమ కాట్లతో కాళ్లు, చేతులు మండిపోతున్నాయిని గగ్గోలు పెడుతున్నారు. దోమలు భయానికి సాయంత్రం 5 గంటలకే తలుపులు వేసేసుకుంటున్నారు. దోమల నియంత్రణకు మందులు ఎన్ని వాడుతున్నా ఫలితాలు కనిపించడం లేదని, రాత్రి వేళ నిద్ర పట్టడం లేదని ప్రజలు వాపోతున్నారు. డెంగీ, మలేరియా వ్యాపించే అవకాశముందని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దోమల నియంత్రణ చర్యలను అధికారులు గాలికొదిలేశారు. సకాలంలో పన్నులు కట్టించుకునే అధికారులు ఈ సమస్యపై మాత్రం స్పందించడం లేదని జనం ఆరోపిస్తున్నారు. శీతకాలం కావడంతో దోమలు మరింతగా వృద్ధి చెందుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా అధికారులు స్పందించి దోమల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.