Dec 17,2022 23:34

జెసిబితో మరమ్మతు పనులు చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-వడ్డాది
గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ ఆధ్వర్యాన వడ్డాది వంతెనకు మరమ్మతు పనులు శుక్రవారం రాత్రి ప్రారంభించారు. సుగర్‌ ఫ్యాక్టరీకి చెరకు రవాణాకు ఇబ్బందులు ఏర్పడడంతో యుద్ధ ప్రతిపాదికన ఈ మరమ్మతు పనులు చేపట్టారు. దీనికి ఫ్యాక్టరీ నుండి రూ.6 లక్షలు నిధులు విడుదల చేశారు. వంతెనపై రాకపోకలు నిలుపుదల చేసి శనివారం తెల్లవారి వరకు జెసిబితో బండరాళ్లు పూర్చారు. గతంలో పేర్చిన బండరాలను తొలగించి కొత్తగా పెద్దరాళ్లను తీసుకొచ్చి వెడల్పు చేసి వంతెన నాలుగు ఖానాల మధ్య రాళ్లను పేర్చారు. శనివారం గోవాడ సుగర్స్‌ ఎమ్‌డి సన్యాసినాయుడు, సిడిఓ రామం, జడ్పిటిసి దొండా రాంబాబు వంతెన మరమ్మతు పనులను పరిశీలించారు. వాహనాల రాకపోకలు దృష్ట్యా రాత్రివేళ మాత్రమే పనులు చేపడతామని, మరో 48 గంటల్లో పనులు పూర్తవుతాయని ఎమ్‌డి తెలిపారు. ఈ పనులకు సహకరించిన ఎమ్మెల్యే ధర్మశ్రీకి, కలెక్టర్‌ రవి పఠాన్‌ శెట్టికి, గ్రామ పెద్దలకు, రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.