బుట్టాయగూడెం:ఇంకా పూర్తికాని పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కాలనీలను వచ్చే నెలాఖరుకు ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తిచేసి, నిర్వాసితులకు కొత్త గృహాలకు తరలించాల్సిందేనని కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ స్పష్టం చేశారు. స్థానిక ప్రాజెక్ట్ అధికారి కార్యాలయంలో జెసి, ఐటిడిఎ ఇన్‌ఛార్జి ప్రాజెక్ట్ అధికారితో కలిసి పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల పునరావాస కాలనీ నిర్మాణ పనులపై శనివారం అధికారులతో, కాంట్రాక్టర్లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ 41.15 కాంటూర్ నిర్వాసితులకు పునరావాస కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అందించి కాలనీలకు తరలిస్తామని సిఎం జగన్ హామీ ఇచ్చారని, ఆ మేరకు పనులు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వేలేరుపాడు, రేపాకగొమ్ము నిర్వాసితులకు నిర్మించిన పునరావాస కాలనీలు పూర్తయ్యాయని, వారిని త్వరితగతిన కాలనీలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్వాసితుల కోసం తాడువాయిలో నిర్మిస్తున్న పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగడంపై సంబంధిత కాంట్రాక్టర్లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడువాయి కాలనీలో ఇంకా ప్రారంభంకాని ఇళ్ల నిర్మాణ పనులను నూరు శాతం వెంటనే ప్రారంభించి, డిసెంబర్ నెలాఖరులోగా ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి, నిర్వాసితులు నివాసం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.










