* పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్
ప్రజాశక్తి - మెళియాపుట్టి, ఇచ్ఛాపురం: ఉద్దానం మెగా వాటర్ ప్రాజెక్టును వచ్చే నెలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ తెలిపారు. మెళియాపుట్టి వద్ద ఉద్దానం ప్రాజెక్టు పనులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల మొదటి వారానికి ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు నీరు ఉద్దానంలోని అన్ని గ్రామాలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. హిరమండలం నుంచి ఇచ్ఛాపురం వరకు పైపులైను పనులు 90 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. నీటి పరీక్షలు సైతం పరిశీలించాలని, ఈ నెలాఖరుకు పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, ఆర్‌డిఒ సీతారామ్మూర్తి, ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజినీర్ ఇన్ చీఫ్ కృష్ణారెడ్డి, జల్ జీవన్ మిషన్ సిఇ గాయత్రీదేవి, ఉద్దానం వాటర్ ఇంజినీర్ ఇన్ చీఫ్ పి.సంజరు రెడ్డి, ఎస్‌ఇ టి.ఎస్ ప్రసాద్, ఇఇ జాన్ బెహరా, తహశీల్దార్ పి.సరోజని, ఎంపిడిఒ పి.చంద్రకుమారి తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికీ తాగునీరు అందించాలి
ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు ద్వారా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఇంటింటికీ తాగునీరందించేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ను కోరారు. ఉద్దానం వాటర్ ప్రాజెక్టు పరిశీలనకు ఇచ్ఛాపురం వచ్చిన ఆయన్ను విజయ కలిశారు.










