Jul 28,2021 07:01

న్యూఢిల్లీ : వచ్చే నెలలోనే చిన్నారులకు కరోనా టీకా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులోనే చిన్నారులకు టీకా ఇచ్చే కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని మంగళవారం బిజెపి ఎపింలతో జరిగిన సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. ఈ నెలలో ఢిల్లీ హైకోర్టుకూడా కేంద్రం ఇదే విషయాన్ని తెలిపిన సంగతి తెలిసిందే.
రెండు నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి టీకా కోసం భారత్‌ బయోటెక్‌, జైడస్‌ క్యాడిలా సంస్థలు క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నాయి. వీటి ఫలితాలు త్వరలోనే వెల్లడి కానుండడంతో పాటు వ్యాక్సిన్‌ కూడా సెప్టెంబర్‌ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌కే అరోరా ఇటీవలే తెలిపారు. అలాగే ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా కూడా సెప్టెంబర్‌లో చిన్నారులకు టీకాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ నెల చివరికి 51 కోట్ల డోసులు
దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ మందకొడిగా సాగుతోందంటూ వస్తోన్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ముఖ్యంగా జులై నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వస్తున్నవి తప్పుడు కథనాలని పేర్కొంది. ఇదివరకే చెప్పినట్లుగా జులై 31 నాటికి 51 కోట్ల డోసులను కచ్చితంగా సరఫరా చేసి తీరుతామని పునరుద్ఘాటించింది. కేంద్ర ఆరోగ్యశాఖ ఈ ప్రకటన చేసింది.
జనవరి నుంచి జులై చివరినాటికి మొత్తం 51.60కోట్ల డోసులను రాష్ట్రాలకు సరఫరా చేస్తామని గతంలోనే అన్ని రాష్ట్రాలకు తెలియజేసినట్లు గుర్తు చేసింది. ఇందుకు తగినట్లుగానే వివిధ తయారీ సంస్థల నుంచి వ్యాక్సిన్‌లను సేకరిస్తున్నామని స్పష్టం చేసింది. ముందస్తు ప్రణాళికలకు అనుగుణంగానే ఆయా రాష్ట్రాలకు కరోనా వ్యాక్సిన్‌లకు కేటాయిస్తున్నామని పేర్కొంది. ఇప్పటికే 45.7కోట్ల డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా చేశామని.. మిగతా 6.03కోట్ల డోసులు జులై 31నాటికి చేరుకుంటాయని తెలిపింది. దీంతో వ్యాక్సిన్‌ పంపిణీలో ముందుగా చెప్పిన లక్ష్యాన్ని చేరుకుంటామని కేంద్ర ఆరోగ్యశాఖ ధీమా వ్యక్తం చేసింది.
30 వేల దిగువకు కొత్త కేసులు
మంగళవారం ఉదయానికి గత 24 గంటల్లో 17,20,110 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 29,689 మందికి పాజిటివ్‌గా తేలింది. మొత్తం కేసులు 3.14కోట్లకు చేరాయి. రోజువారీ కొత్త కేసులు 30వేల దిగువకు చేరడం ఊరట కలిగిస్తోంది. దాదాపు 132 రోజుల తర్వాత కేసులు ఈ స్థాయిలో క్షీణించాయని మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 24 గంటల్లో 415 మంది మరణించగా, ఇప్పటి వరకు 4,21,382 మంది కరోనాతో మరణించారని తెలిపింది.