ప్రజాశక్తి - మంగళగిరి : పట్టణంలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో రూ.3.20 కోట్లతో చేపట్టిన మగ్గాల షెడ్డు నిర్మాణాన్ని మే చివరి వారంలోగా పూర్తి చేసి చేనేత కార్మికులకు అప్పగిస్తామని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలసి పనులను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా 146 మంది ఒకేచోట కూర్చొని మగ్గాలు ద్వారా చేనేత ఉత్పత్తులను తయారు చేయడం మంగళగిరిలో ప్రారంభమవుతుందని వీరు సొంత మగ్గాలతో పనులు చేపట్టడం వల్ల నేతన్న నేస్తం పథకం కింద ఒక్కొక్కరికి ఏడాదికి రూ.24 వేలు అందుతాయని అన్నారు. జాతీయ సమగ్ర చేనేత అభివృద్ధి ద్వారా రూ.1.20 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.2 కోట్లు కలిపి షెడ్‌లను నిర్మించినట్లు తెలిపారు. ఎంఎస్‌ఎంఇ ద్వారా నూతన సాంకేతికతతో రూ.10 కోట్ల అంచనాతో కామన్ ఫెసిలిటీ సెంటర్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని, దీనివల్ల నేతన్నలకు మరింత ఆర్థిక లబ్ధి చేకూరుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంటిఎంసి కమిషనర్ శారదా, వీవర్స్ సర్వీస్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ అనిల్ సాహు, జిల్లా చేనేత, జౌళి శాఖాధికారి వి.వనజ, అసిస్టెంట్ డైరెక్టర్ రియాజ్ సుల్తానా, ఫీల్డ్ ఆఫీసర్లు శ్రీధర్, రాఘవరావు, తహశీల్దార్ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు.










