
* టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి - కోటబొమ్మాళి: వచ్చే ఎన్నికల్లో వైసిపిని ఓడించడమే టిడిపి, జనసేన లక్ష్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. స్థానిక టిడిపి కార్యాలయంలో టిడిపి, జనసేన టెక్కలి నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. అనంతరం ఆయన జనసేన టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కణితి కిరణ్ కుమార్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రజా వ్యతిరేక పాలనను అంతం చేయడానికి ఉమ్మడి ప్రణాళికతో ముందుకు సాగుతామన్నారు. ఇప్పటికే బాబు ష్యూరిటీ, భవిష్యత్‌కు గ్యారెంటీ ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు. 2014లో జనసేన పొత్తుతో అధికారంలోకి వచ్చామని, అప్పుడు సాధించిన ప్రగతి గురించి ప్రజలకు వివరిస్తామన్నారు. అనంతరం టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి అచ్చెన్నాయుడు, కిరణ్ పార్టీ కార్యాలయ ఆవరణలోని అన్నా క్యాంటీన్‌లో భోజనం చేశారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరాజులు, పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్, కోటబొమ్మాళి, టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి టిడిపి మండల అధ్యక్షులు బోయిన రమేష్, బగాది శేషు, పినకాన అజరుకుమార్, జీరు భీమారావు తదితరులు పాల్గొన్నారు.
తమ్మినేని అక్రమాలపై ఛార్జిషీట్
ఆమదాలవలస : శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అవినీతి, అక్రమాలపై పూర్తిస్థాయి ఆధారాలతో ఛార్జిషీట్ తయారు చేసి ప్రజల ముందు దోషిగా నిలబెడతామని టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ అన్నారు. పట్టణంలోని ఒక కళ్యాణ మండపంలో టిడిపి, జనసేన ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు పేడాడ రామ్మోహనరావుతో కలిసి ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో తమ్మినేని అవినీతికి అంతం లేకుండా పోయిందన్నారు. కొత్త పోస్టులు వేసినా, తీసినా సొమ్ము చేసుకున్న ఘనత ఆయనకే దక్కిందని ఆరోపించారు. పట్టణంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలను మూసివేయించి ఆయనకు చెందిన కళాశాలను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆమదాలవలస-శ్రీకాకుళం రోడ్డు పనులకు సంబంధించి ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం, కాంట్రాక్టర్లను కమీషన్ల కోసం వేధిస్తుండడం వల్ల పనులను మధ్యలో విడిచిపెట్టి కాంట్రాక్టరు వెళ్లిపోయారని చెప్పారు. గ్రామాల్లో సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుకోలేకపోయిన చేతకాని ప్రభుత్వమని మండిపడ్డారు. ఈనెల 17న టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు కలిసి గ్రామాల్లో భవిష్యత్‌కు బాబు గ్యారెంటీ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. 18న రోడ్ల దుస్థితిపై ఉమ్మడిగా నిరసన తెలపనున్నట్లు చెప్పారు. వైసిపి ప్రభుత్వ అవినీతి అరాచకాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, టిడిపి నాయకులు మొదలవలస రమేష్, తమ్మినేని విద్యాసాగర్, జనసేన నాయకులు పాత్రుని పాపారావు తదితరులు పాల్గొన్నారు.
తరిమికొట్టడం ఖాయం
పలాస : టిడిపి, జనసేన ఐకమత్యంతో పనిచేసి అధికార వైసిపిని గద్దె దింపుతాయని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌత శిరీష, జనసేన పలాస నియోజకవర్గ ఇన్‌ఛార్జి వి.దుర్గారావు అన్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో టిడిపి, జనసేన పలాస నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరాచక ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కొండలరాజుకు వచ్చే ఎన్నికల్లో రాజకీయాల నుంచి తరిమికొట్టడం ఖాయమన్నారు. సమావేశంలో టిడిపి నాయకులు వజ్జ బాబూరావు, పీరుకట్ల విఠల్, ఎల్.కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.