- కృష్ణా వర్శిటీ వీసీ రామమోహనరావు
ప్రజాశక్తి-వన్‌టౌన్: రానున్న విద్యా సంవత్సరం నుంచి కష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ నాలుగేళ్ల కోర్సులను నిర్వహించనున్నట్లు ఆ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కే.రామమోహనరావు అన్నారు. కష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని కష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఉన్న అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్, యజమాన్యాల సమావేశం విశ్వవిద్యాలయం సీడీసీ విభాగం ఆధ్వర్యంలో విజయవాడ కాకరపర్తి భావనారాయణ కళాశాల ప్రాంగణంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామమోహనరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానంలో భాగంగా విశ్వవిద్యాలయం పరిధిలో అనేక నూతన చర్యలు చేపడుతున్నామన్నారు. అందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి డిగ్రీ కోర్సును నాలుగేళ్ల కాల పరిమితికి పెంచనున్నట్లు చెప్పారు. నాలుగో ఏడాదికి సంబంధించి విద్యార్ధులు రీసెర్చ్, లేదా సాధారణ విద్యాభ్యాసం వైపు రెండు అవకాశాలను ఇవ్వటం జరుగుతుందన్నారు. దీనిపై త్వరలోనే విధివిధానాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేయనుందన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్ధులను మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దేందుకు విశ్వవిద్యాలయం అనేక నూతన నిర్ణయాలను తీసుకోనుందన్నారు. అందులో భాగంగా అనుబంధ కళాశాలలు సహకరించి తమను తాము మరింత బలోపేతం చేసుకోవాలన్నారు. విద్యార్ధులను పారిశ్రామిక రంగానికి చేరువు చేయటంతో పాటుగా వారిలో వత్తినైపుణ్యాలను తీర్చిదిద్దేందుకు ఇంటర్న్‌షిప్ విధానం చాలా అండగా ఉంటుందన్నారు. రానున్న విద్యా సంవత్సరం డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్లను త్వరగా ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. క్యాంపస్ ఇంటార్వూలలో విద్యార్ధులు అత్యధికంగా పొందే ప్యాకేజీ విషయంలో దేశంలోనే ఏపీ విద్యార్ధులు రెండో స్థానంలో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో రిజిష్ట్రార్ ఎం.రామిరెడ్డి, సీడీసీ డీన్ డాక్టర్ డి.రామశేఖరరెడ్డి, అసిస్టెంట్ డీన్ డాక్టర్ ఆర్ విజయకుమారి, కేబీఎన్ కళాశాల కార్యదర్శి తూనుకుంట్ల శ్రీనివాసు, ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.










