కడప అర్బన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం వార్షిక పరీక్షల్లో సంస్కరణలు అమలు చేస్తున్నట్లు విసి ఆచార్య చింతా సుధాకర్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన తన చాంబర్లో కుల సచివులు ఆచార్య వై.పి.వెంకటసుబ్బయ్య, ప్రిన్సిపల్ రఘునాధరెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎన్.ఈశ్వరరెడ్డి, అన్ని విభాగాల అధిపతులతో కలిసి బేటి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు ఒకే చోట నిర్వహించడం కాకుండా, ఆయా శాఖలలో నిర్వహించేలా వికేంద్రీకరణ దిశగా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇకపై ప్రతి డిపార్ట్మెంట్ వారి శాఖలోనే పరీక్షలు నిర్వహించాలన్నారు. సరికొత్త విధానంలో క్వశ్చన్ పేపర్ మేనేజ్మెంట్ సిస్టం అమలు చేస్తున్నామన్నారు. ప్రశ్నాపత్రం ఆన్‌లైన్‌లో సంబంధిత హెడ్లకు కొన్ని నిమిషాల ముందు అందుతుందని వాటిని ప్రింట్ చేసి విద్యార్థులకు అందిం చాల్సి ఉంటుందన్నారు. పరీక్షలు పూర్తి అయిన వారంలోపే ఫలితాలు ఇచ్చేలా మూల్యాంకనం చేయాల్సి ఉంటుందన్నారు. పరీక్షల ప్రారంభం నుంచి ఫలి తాలు ప్రకటించే వరకు రెగ్యులర్ అధ్యాపకులు ఎవ్వరు సెలవు తీసుకోకూడదని స్పష్టం చేశారు. క్వశ్చన్ పేపర్ మేనేజ్మెంట్ సిస్టం గురించి ఆచార్య ఎన్.ఈశ్వర్‌రెడ్డి అవగాహన కల్పించారు. సమావేశంలో అన్ని శాఖల అధిపతులు పాల్గొన్నారు.సమావేశంలో మాట్లాడుతున్న విసి సుధాకర్










