Sep 20,2023 20:20

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న విసి సుధాకర్‌

కడప అర్బన్‌: యోగి వేమన విశ్వవిద్యాలయ పీజీ సెమిస్టర్‌ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. వైవీయూ విసి ఆచార్య చింతా సుధాకర్‌, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎన్‌.ఈశ్వరరెడ్డితో కలసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విసి విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఆర్ట్స్‌ బ్లాక్‌, సైన్స్‌ బ్లాక్‌, కామర్స్‌, మేనేజ్మెంట్‌ బ్లాక్‌లో జరుగుతున్న పరీక్షలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి తెలిపారు. విశ్వవిద్యాలయం పరీక్షల సంస్కరణలు తీసుకొచ్చిందని, వికేంద్రీకరణ విధానం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. తద్వారా ఫలితాలు త్వరగా విడుదలై విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎన్‌.ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో మూడు కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభమయ్యాయని చెప్పారు. తొలి రోజు రెండవ సెమిస్టర్‌ నాన్‌ కోర్‌ పరీక్ష నిర్వహించామని తెలిపారు. గురువారం నుంచి నాలుగో సెమిస్టర్‌ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. మరోవైపు విశ్వవిద్యాలయ క్యాంపస్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య ఎస్‌.రఘునాథ్‌ రెడ్డి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణలో అన్ని శాఖల సహాయ ఆచార్యులు, సహా ఆచార్యులు, ఆచార్యులు పాల్గొన్నారు. తొలి రోజు సెమిస్టర్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు.