Sep 30,2023 20:16

సమావేశంలో మాట్లాడుతున్న విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ

ప్రజాశక్తి-విజయనగరం :  అక్టోబర్‌ 29, 30, 31 తేదీల్లో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ వైభవోపేతంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌ ఆడిటోరియం లో జిల్లా అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో అమ్మవారి పండగ, విజయనగరం ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్ల పై సమావేశం నిర్వహించారు. సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను చేయాలని సూచించారు. ఉత్సవ్‌ కమిటీ లో ఆసక్తి గల వారు కొత్తగా సభ్యులుగా చేరాలనుకునే వారు జిల్లా కలెక్టర్‌ ను కలసి వారి వివరాలను సమర్పించాలని తెలిపారు. కమిటీ సభ్యులు అధికారులు కలసి చర్చించుకొని జిల్లా కలెక్టర్‌ ఆమోదం తో వేదిక వారీగా కార్యక్రమాలను రూపొందించాలని తెలిపారు.
డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ ఈ ఉత్సవాలకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేయాలని అన్నారు. జిల్లా అధికారులను ఇన్‌ఛార్జులుగా పెడుతూ కమిటీ సభ్యులను వేస్తామన్నారు. సోమవారం మెగా మ్యూజికల్‌ నైట్‌ నిర్వహించాలని, ఆనంద గజపతి ఆడిటోరియంలో స్థానిక కళాకారుల తో ప్రదర్శనలు నిర్వహించాలని తెలిపారు. విఐపిల జాబితా ముందుగానే తయారు చేసుకొని వారికి కేటాయించిన సమయాల్లో దర్శనాలను ఏర్పాటు చేయాలన్నారు. భక్తులంతా సోమవారం లోగానే దర్శనాలు పూర్తి చేయాలన్నారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాస రావు మాట్లాడుతూ స్థానిక కళాకారులందరికీ అవకాశాలు కల్పించి ప్రోత్సహించాలని తెలిపారు. కలెక్టర్‌ నాగలక్ష్మి, మేయర్‌ విజయలక్ష్మి, ఎస్‌.పి దీపిక, జెసి మయూర్‌ అశోక్‌, డిఆర్‌ఒ అనిత, సహాయ కలెక్టర్‌ త్రివినాగ్‌, దేవాలయం ఎసి, ఉత్సవ్‌ కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.