
ప్రజాశక్తి - ఇంకొల్లు రూరల్
సాగునీరు లేక పోవటం, వరుణుడు కరుణించక పోవటంతో ఈ ఏడాది రైతులు ఏ పంట వేయాలో అర్ధం కాక ఊగిసలాడుతున్నారు. మిర్చి సాగు చేసే సాహసం చేయడంలేదు. వైట్ బర్లి పొగాకుపైనే ఆశలన్నీ పెట్టుకొని సాగు చేస్తున్నారు. అక్కడక్కడా మిర్చి సాగు చేసినప్పటికి కుంటల్లో ఉన్న నీటిని పెట్టుకొని పంటలను కాపాడుకునేందుకు సాహసం చేస్తున్నారు. కొంత మంది రైతులు మిర్చి సాగుకు సాహసం చేయలేక మెట్ట పొలాలలో వైట్ బర్లీ సాగుపై ఆసక్తి కనపరుస్తున్నారు. మార్కెట్ ధర కూడా ఆశాజనకంగా ఉంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం నాణ్యత గల పొగాకు క్వింటాలు రు.16వేల నుంచి రు.18వేల వరకు ధర పలుకుతుంది. దీంతో పత్తి, మిరప, శనగ, మొక్కజొన్నపంటల కన్నా వైట్ బర్లీ పొగాకు సాగు చేయటమే ఉత్తమమని రైతులు భావిస్తున్నారు. దీంతో వైట్ బర్లీ పొగాకు నారుకు గిరాకీ పెరిగింది. వర్షాభావంతో నారుమళ్ళు దెబ్బతిన్నాయి. దీంతో నారు ధరకు రెక్కలొచ్చాయి. నారు మూట రు.2500 నుంచి రు.3వేలు ధర పలుకుతుంది. ఎకరా విస్తీర్ణానికి 7వేల నుంచి 8వేల మొక్కలు అవసరం అవుతాయి. మూటకు 6వేల మొక్క వరకు ఉంటుంది. ఈ లెక్కన ఎకరాకు రు.4వేలు ఖర్చు అవుతుంది. మార్టూరు మండలం బొబ్బేపల్లి, ద్రోణాదుల, తాతపూడి, మురికిపూడితో పాటు మరికొన్ని గ్రామాల్లో రైతులే స్వయంగా నారు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఇంకొల్లు మండలంలోని హనుమోజిపాలెం, ఇంకొల్లు, దుద్దుకూరు, పావులూరు గ్రామాల్లో సాగు చేసేందుకు రైతులు సిద్దమవుతున్నారు.