
వైసిపి ఎస్‌సి సెల్ ప్రాంతీయ సదస్సులో ఎంఎల్‌ఎ ఆళ్లనాని
ప్రజాశక్తి - ఏలూరు టౌన్
వైసిపి పాలనలో దళితులు, పేదలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నారని వైసిపి జిల్లా అధ్యక్షులు, ఎంఎల్‌ఎ ఆళ్ల నాని తెలిపారు. వైసిపి ఎస్‌సి సెల్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ యాత్ర సన్నాహక సదస్సును ఆదివారం ఏలూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో దళిత, బడుగు బలహీన వర్గాలు ధైర్యంగా జీవిస్తున్నారని తెలిపారు. బడుగు వర్గాల ఉజ్వల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం జగన్‌మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడం అత్యంత ఆవశ్యకమన్నారు. ప్రతిపక్షాలు రాష్ట్ర అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటూ.. చేస్తున్న దుష్ఫ్రచారాలను క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాల కుట్రలను ఎదుర్కోవడంలో జగన్‌కు అండగా నిలబడాలని, జిల్లాలో జరిగే సామాజిక న్యాయ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు మేరుగు నాగార్జున మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనా విధానాన్ని జగన్‌మోహన్ రెడ్డి అనుసరిస్తున్నారన్నారు. పేదల అభ్యున్నతి కోసం, వారికి బంగారు భవిష్యత్తు అందించడం కోసం వైఎస్ జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు అడుగడునా దళితులను అవమానించారని, టిడిపి హాయాంలో దళితులపై, అనేక అకృత్యాలు జరిగాయని విమర్శించారు. ఎంపీ నందిగం సురేశ్ మాట్లాడుతూ నవరత్నాలలో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. వైసిపి ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. నాడు - నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసి కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని వ్యాధులను చేర్చి నాణ్యమైన ఉచిత వైద్యం అందుబాటులోకి తీసుకు వచ్చామని తెలిపారు. సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ వైఎస్ జగన్ నేతృత్వంలో దళితులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నారన్నారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థతో పల్లెల్లో మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తుందన్నారు. అనంతరం ఎంఎల్‌ఎలు ఎలిజా, కైలే అనిల్ కుమార్, తలారి వెంకట్రావు, రక్షణనిధి, చిట్టిబాబు, సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకరరావు, ఎంఎల్‌సిలు పండుల రవీంద్ర, ఇశ్రాయేలు, ఎం.అరుణ్ కుమార్, తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో దళిత నేతలు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.