
ప్రజాశక్తి-భోగాపురం : వైసిపి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు తెలిపారు. మండలంలోని గూడెపువలస సచివాలయ పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఈ సచివాలయ పరిధిలోని దల్లిపేట పంచాయతీలో సర్పంచ్ దల్లి కాంత, మాజీ సర్పంచ్ దల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా దల్లిపేట, ముగడపేట, గాలిపేట, రాళ్ళపాలెం, వెంపాడపేట గ్రామాల్లో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు.. ప్రభుత్వ పథకాలను గడపగడపకు వెళ్లి వివరించారు. మళ్లీ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి గెలిపించాలని ఆయన కోరారు. మళ్లీ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని వారికి వివరించారు. ఈ సందర్భంగా తాగునీరు, కాలువలు, ఇళ్ల బిల్లుల సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కాలువల నిర్మాణానికి రోడ్డుకు ఇరువైపులా ఉన్న సొంత స్థలాలను ఇస్తే నిధులు ఇచ్చే బాధ్యత తనదని అన్నారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, తహశీల్దారు చింతా బంగార్రాజు, ఎంపిడిఒ అప్పలనాయుడు, నాయకులు పడాల శ్రీనివాసరావు, కొల్లి రామ్మూర్తి, సుందర హరీష్, శీరపు గురునాథ్, మైలపల్లి నర్సింహులు, అపరభుక్త పైడినాయుడు, గాలి రాజారెడ్డి, దల్లి బంగారురెడ్డి తదితరులు పాల్గొన్నారు.