Jun 28,2023 20:21

గోడపత్రికను విడుదల చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
విద్యా వ్యవస్థను సర్వ నాశనం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అసమర్థ, అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర విద్యార్థులందరూ విద్యను కొనసాగించలేక, ఫీజులు కట్టుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మున్సిపల్‌ టిడిపి కౌన్సిల్‌ లీడర్‌ దయాసాగర్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షులు మాదిగ నాగరాజు, సి.రంజిత్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం టిడిపి, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో 'కంస మామ ఫీజు ఎక్కడ' అనే గోడపత్రికను సిద్ధార్థ డిగ్రీ కళాశాల విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యార్థులు మధ్యలో విద్యకు దూరమవుతున్నప్పటికీ, ఈ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని తెలిపారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థలు నిర్వీర్యం చేసేలా తెచ్చిన జిఒలను వెనక్కి తీసుకోవాలని, జిఒ 71ను రద్దు చేసి పేద విద్యార్థులకు ఉన్నత విద్యనందించాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని కోరారు. హాస్టల్‌లో వసతులు లేక, సొంత భవనాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు అర్జున్‌ శశి, భీమా గౌడు, ఉరుకుందు, నరేష్‌, సోషల్‌ మీడియా హరి పాల్గొన్నారు.