Jul 02,2023 18:02

ఉదయం జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్థర్‌

 

మధ్యాహ్నం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్న సిద్ధార్థ రెడ్డి గ్రూపు నాయకులు
మధ్యాహ్నం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్న సిద్ధార్థ రెడ్డి గ్రూపు నాయకులు

 

వైసిపిలో వీడని గ్రూపుల పోరు
- ఒకే కార్యక్రమాన్ని వేరువేరుగా నిర్వహించిన వైనం
- ఉదయం ఎమ్మెల్యే ఆర్థర్‌.. మధ్యాహ్నం సిద్ధార్థ రెడ్డి గ్రూపు వారు..
ప్రజాశక్తి - పగిడ్యాల

       సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నా నందికొట్కూరు నియోజకవర్గంలో అధికార వైసిపిలో గ్రూపుల పోరు వీడడం లేదు. 2019 ఎన్నికల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైసిపి అభ్యర్థి గెలుపునకు కృషి చేశారు. దీంతో అప్పట్లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన తోగూరు ఆర్థర్‌ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల అనంతరం రెండు గ్రూపులుగా విడిపోయారు. అప్పటి నుంచి ఏ ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టినా వేరువేరుగానే నిర్వహిస్తున్నారు. దీంతో అధికారులకు తలనొప్పిగా మారడమే కాక వైసిపి కిందిస్థాయి కార్యకర్తలు ఎటువైపు వెళ్ళాలో తెలియక సతమతమవుతున్నారు.
పగిడ్యాల మండలం శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సొంత మండలం. దీంతో ఈ మండలంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గ్రూపు ఆధిపత్యం కొనసాగుతోంది. ఎమ్మెల్యే ఆర్థర్‌ ఏ కార్యక్రమం నిర్వహించినా ఆ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో పాటు వాలంటీర్లను కూడా హాజరుకాకుండా చేస్తున్నారు. అలాగే ఈ నెల 1వ తేదీన నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమం ఎమ్మెల్యే, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గ్రూపులు ఒకే కార్యక్రమాన్ని వేరువేరుగా నిర్వహించారు. ఒక గ్రూపు వారు ఉదయం, మరో గ్రూపు వారు మధ్యాహ్నం నిర్వహించడంతో స్థానిక ప్రజలు అవాక్కయ్యారు. ఒకే పార్టీలో ఉండి అందులో అధికార పార్టీ అయిన వైసిపిలో ఉండి సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా చూడాల్సింది పోయి గ్రూపుల పోరులో వేరువేరుగా నిర్వహించడంపై చర్చనీయాంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నందికొట్కూరు నియోజవర్గంలో శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్‌ గ్రూపుల పోరు వీడకపోతే రాబోయే ఎన్నికల్లో తీవ్ర నష్టం జరిగే అవకాశం లేక పోలేదని స్థానిక వైసిపి నాయకులు, కార్యకర్తలు పేర్కొంటున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ తోగూరు ఆర్థర్‌కే వైసిపి టికెట్టు వస్తుందని ఆ గ్రూపు నాయకులు చెప్పుకుంటున్నారు. నందికొట్కూరు నియోజవర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్లీ ఆర్థర్‌కే అధిష్టానం ఖరారు చేసిందని బహిరంగ ప్రచారం చేస్తున్నారు. అయితే నియోజకవర్గంలో శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి అనుచర బలంగంతో పాటు ప్రజాదరణ అధికంగా ఉందని, ఆయన ఎవరి పేరు చెబితే వారికే వైసిపి అధిష్టానం నందికొట్కూరు నియోజవర్గ అభ్యర్థిగా ఖరారు చేస్తుందని సిద్ధార్థ రెడ్డి గ్రూపు వారు చెబుతున్నారు. గ్రూపుల పోరు వలన కలిసి పని చెయ్యకపోవడంతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాతకోట, నెహ్రూ నగర్‌ గ్రామ సర్పంచు స్థానాలు, లక్ష్మాపురం ఎంపిటిసి స్థానాలు కోల్పోయామని వైసిపి కార్యకర్తలు చెబుతున్నారు. ఇప్పటికైనా గ్రూపుల పోరు వీడాలని, లేకపోతే రాబోయే ఎన్నికల్లో వైసిపికి భారీ నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.