Oct 06,2023 00:33

వైసిపిలో గ్రూపులు నలుగురు కార్పొరేటర్లపై చర్యలు

వైసిపిలో గ్రూపులు
నలుగురు కార్పొరేటర్లపై చర్యలు
నియోజకవర్గ పట్టుకై ఆధిపత్య పోరు
ప్రజాశక్తి -చిత్తూరుఅర్బన్‌
అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చిత్తూరు నియోజకవర్గంలో గ్రూపులు మరో మారు భగ్గుమన్నాయి. నియోజకవర్గంలో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో ఎంఎల్‌ఏ, ఎపిఎస్‌ ఆర్‌టిసి వైఎస్‌ ఛైర్మెన్‌ విజయానందరెడ్డి గ్రూపులకు చెందిన పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు వేరు వేరుగా నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు బలనిరూపన ఈ రెండు గ్రూపుల మధ్య సాగుతోంది. చిత్తూరు ఎంఎల్‌ఏ స్థానానికి జరుగుతున్న ఆధిపత్య పోరుగా అధికార పార్టీ నాయకుల్లో చర్చ సాగుతోంది.
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో మరో మారు నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం వేదికగా మారింది. చిత్తూరు నగర పాలిక సంస్థలో అధికార వైసీపికి 47 మంది కార్పొరేటర్లున్నారు. ఒక స్వతంత్ర అభ్యర్థి లక్ష్మణ్‌ వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే ప్రతిపక్ష తెలుగుదేశం కార్పొరేటర్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కార్పొరరేటర్లు రెండు గ్రూపులుగా ఉంటూ ఎంఎల్‌ఏ, ఎపిఎస్‌ ఆర్‌టిసి వైఎస్‌ ఛైర్మెన్‌ మద్దతుదారులుగా మారిపోయిన పరిస్థితి ఉంది. నగర పాలక సంస్థలో బిల్లుల ఆమోదానికి ఓ గ్రూపు ఓకే చేస్తే మరో గ్రూపు వ్యతిరేకిస్తోంది. దీంతో నగర అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులు ఆమోదం పొందేలేకపోతున్నాయి. నగరంలోని సమస్యలను చర్చించి కౌన్సిల్‌ ఆమోదంతో అభివృధ్ధి పనులు చేయాల్సిన నగర పాలక సంస్థ అధికారులకు ఇబ్బందికరంగా మారిందంటూ విమర్శలున్నాయి.
భగ్గమన్న విబేధాలు
బుధవారం నగర పాలక కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశంలో అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య విబేదాలు మరో మారు భగ్గమన్నాయి. సాధారణ నిధుల నుండీ ప్రతి డివిజన్‌కు రూ. 50 లక్షలు మంజురు చేయాలని ప్రభుత్వం నుండీ నిధులు మంజురైయ్యాయి. కనీస మౌళిక వసతులకు నోచుకొని మురికివాడలు- రోడ్లు, డ్రైనేజీలున్న డివిజన్స్‌కు ఒకే రకంగా నిధులు మంజురు చేయడంపై ఓ వర్గం కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందని డివిజన్లకు డ్రైనేజి, రోడ్లు, వీధిలైట్లు ఇతర అభివృద్ధి పనులు చేసేందుకు నిధులు ఎక్కువశాతం కేటాయించాలని ఓ గ్రూపు పట్టుబడితే, సమానంగా కేటాయించాలంటూ మరో గ్రూపు కార్పొరేటర్లు పట్టుబట్టారు. బుధవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశంలో రెండు వర్గాలుగా విడిపోయిన కార్పొరేటర్లు నిధుల కేటాయింపుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మేయర్‌ పోడియం వద్ద నిరసన తెలిపారు. ఉదయం 10 గంటల నుండీ మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించాల్సిన కౌన్సిల్‌ సమావేశం అర్థతరంగా ముగిసింది. అధికార పార్టీ ప్రముఖ నాయకుడి మద్దతుదారులు తమ డివిజన్లకు అన్యాయం జరుగుతోందంటూ నగర కమిషనర్‌కు వినతి చేశారు.
మంత్రి పెద్దిరెడ్డి దృష్టికి
బుధవారం నగర పాలక సంస్థలో చోటు చేసుకున్న పరిణామాలను ఎంఎల్‌ఏ ఆరణి శ్రీనివాసులు తన అనుచర కార్పొరేటర్లను వెంటబెట్టుకొని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకుపోయారు. చిత్తూరు నగరంలో చేపట్టాల్నిన అభివృద్ధి కార్యక్రమాలను అడ్డకుంటున్నారంటూ మంత్రికి ఫిర్యాదు చేశారు. పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయడంతో పాటు కౌన్సిల్‌ సమావేశాన్ని అడ్డుకొని నగర మేయర్‌ పట్ల అమర్యాదగా ప్రవర్తించి పోడియం వద్ద నిరసన తెలిపారంటూ మంత్రికి వివరించారు. సీరియస్‌గా తీసుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికార పార్టీ డిప్యూటీ మేయర్‌ రాజేష్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లు శ్రీకాంత్‌, గడ్డం రమణ, ఇందు లను పార్టీ నుండీ సస్పెండ్‌ చేయాలంటూ ఆదేశించిన్నట్లు గురువారం వీడియో క్లిపింగ్స్‌ సోషియల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు రాజేష్‌కుమార్‌రెడ్డి, శ్రీకాంత్‌, గడ్డం రమణ, ఇందు లకు వైకాపా జిల్లా ఇన్‌చార్జి, ఎంఎల్‌సీ భరత్‌ పార్టీ నుండీ షోకాజ్‌నోటీసులు జారీ చేయడం అధికార పార్టీలో అలజడి రేపుతోంది.