ప్రజాశక్తి-పాలకొండ : పాలకొండ నియోజకవర్గంలో వైసిపిలో గ్రూపుల పోరు మొదలైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలతోపాటు వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా చోటుచేసుకున్న బల నిరూపణ కార్యక్రమం అందుకు బలాన్నిస్తోంది. పాలకొండ నియోజకవర్గ పరిధిలో పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం మండలాలున్నాయి. గతంలో నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగిరేది. 2014 ఎన్నికల్లో టిడిపి కంచుకోటను ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి బద్దలు కొట్టి వైసిపి జెండా ఎగురవేశారు. 2019లోనూ ఆమె మరోసారి ఘన విజయం సాధించారు. 2014 నుంచి వైసిపికి ఎదురులేని నియోజకవర్గంగా మారింది. పార్టీ కేడర్ కూడా బలంగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో నాయకుల మధ్య చిన్నచిన్న విభేదాలు ఉన్నప్పటికీ ఎన్నికల కాలంలో మాత్రం ఏకతాటిపై పనిచేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మాజీ మంత్రి పుష్పశ్రీవాణి సోదరి పాలకొండ నియోజకవర్గంలో ఉన్నారు. శ్రీవాణి సోదరి భర్త గువ్వల రమేష్‌బాబుకు ఈ ప్రాంతంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో శ్రీవాణి సోదరికి టిక్కెట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా రమేష్‌బాబు సీతంపేట ఏజెన్సీలో కాంట్రాక్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. దీంతోపాటు యువకుడు కావడంతో ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారని చర్చించుకుంటున్నారు. ఇప్పటి నుంచే ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నట్టు సమాచారం. తాజాగా శనివారం వైఎస్ జయంతి వేడుకల్లో ఈ విషయం రుజువైంది. తనకంటూ కేడర్ ఉందని నిరూపించుకోవాలని రమేష్‌బాబు ఒక ప్రయత్నం చేశారన్న చర్చ నడుస్తోంది. ర్యాలీతోపాటు వైఎస్ జయంతి ఉత్సవాలకు ఆయన జనసమీకరణ చేసుకుని హాజరవడంతో ఈ చర్చకు దారితీసింది.
ఎమ్మెల్యే కళావతికి నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉంది. పార్టీలో కూడా ఆమెకు మంచి పేరుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పార్టీకి విధేయురాలుగా ఉంటున్న ఆమెను కాకుండా వేరే వ్యక్తికి టిక్కెట్ ఇచ్చే అవకాశాలు లేవని ఆ పార్టీలోనే కొంతమంది చర్చించుకుంటున్నారు. కళావతి కూడా నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.










