
కదిరి అర్బన్ : వైసిపి ప్రారంభం నుంచి కదిరి నియోజకవర్గంలో ఆ పార్టీ అభివృద్ధి కోసం కొందరు నాయకులు నిరంతరం పని చేశారు. వారి భుజస్కంధాలపై జెండాను మోసి గ్రామాల్లోకి పార్టీని తీసుకెళ్లారు. ఇలాంటి చాలా మంది నేతలు ప్రస్తుతం అధిష్టానం గుర్తింపు లేక సాధారణ నాయకుల మాదిరే ఉండిపోతున్నారు. ఆర్థిక బలం ఉన్న వారికే పార్టీలో గుర్తింపు లభిస్తోందని కొందరు నాయకులు వాపోతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ పివి.సిద్ధారెడ్డి, మాజీ సమన్వయకర్త ఎస్‌ఎండి ఇస్మాయిల్, సీఈసీ సభ్యుడు పూల శ్రీనివాసులు, వాల్మీకి అధినేత, నియోజకవర్గ వైసిపి నాయకులు పవన్ కుమార్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బత్తల హరిప్రసాద్‌లు ప్రజల మధ్య ఉంటున్నారు. నియోజకవర్గంలో వైసిపి అభివృద్ధిలో వీరి కృషి చేసి ఏదో రూపంలో ఉంది. కరోనా, వరదల సమయంలో ప్రజలకు అండగా నిలబడి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించారు. ఇదిలా ఉండగా ఇటీవల కదిరి వైసిపి రాజకీయాల్లో కొత పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆర్థిక బలం ఉన్నవారు పార్టీలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీరంతా ఎలాగైనా అధిష్టానంను ప్రసన్నం చేసుకుని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్టు పొందాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కులం సమీకరణలను ముందుకు తెచ్చి కదిరిలో అత్యధికంగా ఉండే ఓ సామాజిక వర్గం నాయకున్ని తెరపైకి తేవాలనే ప్రచారం ఇటీవల ఆ పార్టీలో ఎక్కవగా కన్పిస్తోంది. దీనిని అదే సామాజిక వర్గం నేతలు కూడా వ్యతిరేస్తున్నారు. ఎన్నికల సమయంలో పార్టీలోకి వచ్చినంత మాత్రానా వారికి కోసం పని చేస్తామా అంటూ ఆ సామాజిక వర్గం నాయకులే బహిరంగ విమర్శలు చేస్తున్నారు. కదిరి నియోజవకర్గం వైసిపికి కంచుకోటనే చెప్పాలి. వైసిపి పోటీ చేసిన రెండు పర్యాయాలు ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇలాంటి పరిస్థితుల్లో కదిరి వైసిపి టికెట్టు తెచ్చుకునేందుకు ఆ పార్టీలో పెద్ద ఎత్తున నేతలు ఉత్సాహం కనబరుస్తున్నారు. వైసిపి బీఫామ్‌తో పోటీ చేస్తే గెలుపు తమదే అన్న ధీమాతోనే నేతలు ఉన్నారు. అధిష్టానం మాత్రం అభ్యర్థి ఏవరన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టమైన సంకేతాలు ఏవీ ఇవ్వడం లేదు. నేతలు మాత్రం ఎవరికి వారు తామే అభ్యర్థులం అంటూ వారి అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధిష్టానం ఇంతకాలం కోసం పార్టీ కోసం పని చేసిన వారిని గుర్తిస్తుందా..? లేక ఆర్థిక మూలాలు ఉన్న వారిని బరిలోకి దింపుతుందా.? అన్నది వేచి చూడాల్సి ఉంది.