
వైసిపిలో ఎన్నికల వేడి మొదలైంది. అటు పార్టీలోనూ, ఇటు కార్యకర్తల్లోనూ ఎక్కడ విన్నా ఎన్నికలు, సీట్ల కేటాయింపుపైనే చర్చనడుస్తోంది. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలోనూ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వచ్చే ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగుతాయని క్లారిటీ ఇచ్చిన సంగతి విధితమే. అంతకు ముందే ఇప్పటి పరిస్థితులు రీత్యా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇవ్వలేమని కూడా స్పష్టం చేశారు. అలా అని టిక్కెట్లు పొందగలిగినవారు, పొందలేనివారు కూడా నా మనుషులే అంటూ ఒకింత బుజ్జగింపు చర్యలు కూడా ఆ మాటల్లోనే వ్యక్తమయ్యాయి. ఇందుకనుగుణంగానే జిల్లాలో వచ్చే ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలి? ఎవరిని పక్కన బెట్టాలన్నదానిపై ఇప్పటికే అధిష్టానం క్లారిటీతో ఉన్నట్టుగా సమాచారం. ఇందులో భాగంగానే ఇటీవల నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో పలువురికి టికెట్లు ఖరైనట్టు పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు.
ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : వాస్తవానికి వైసిపి చేయించుకున్న ఐప్యాక్ సర్వేలో జిల్లాల్లో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేక ఉన్నట్టుగా తేలిందని సమాచారం. ఈ సంగతి కాస్త పక్కనబెడితే ఇటీవల బొండపల్లిలో జరిగిన వైసిపి సమావేశంలో గజపతినగరం ఎమ్మెల్యేను మరోసారి గెలిపించు కోవాలంటూ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. అటు ఎస్.కోటలోనూ స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసరావే మళ్లీ పోటీ చేయనున్నట్టు మూడురోజుల క్రితం ఎల్.కోటలో జరిగిన సమావేశంలో చెప్పేశారు. దీంతో, కంగుతిన్న కొంతమంది ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు గురించి ప్రస్తావన తేగా 'ఆ సంగతి సిఎం గారు చూసుకుంటారు' అంటూ బుదులిచ్చినట్టు సమాచారం. దీనికి ముందు మాట్లాడిన మంత్రి బొత్స కూడా అధిష్టానం నిర్ణయం శిరోధార్యంగా భావించాలంటూ చురకలు అంటించారు. దీంతో, గజపతినగరంలో బొత్స అప్పలనర్సయ్యకు, ఎస్.కోటలో కడుబండి శ్రీనివాసరావుకు టిక్కెట్ల విషయంలో లైన్ క్లియర్ అయినట్టే.
ఇక చీపురుపల్లి నుంచి మంత్రి బొత్సను, విజయనగరం నుంచి డిప్యూటీ స్పీకర్ కోలగట్లను అధిష్టానం కాదనే పరిస్థితి దాదాపు లేదు. ఒక వేళ మంత్రి తప్పనిసరి పరిస్థితుల్లో ఎంపీగా పోటీచేయాల్సి వస్తే, ఆయన సతీమణి, మాజీ ఎంప బొత్స ఝాన్సీలక్ష్మికి చీపురుపల్లి నుంచి అవకాశం ఇస్తారని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇటీవల నెల్లిమర్ల నియోజకవర్గ సమావేశం జరిగినప్పటికీ 'బస్సు యాత్ర విజయవంతమైతే మీ ఎమ్మెల్యే గెలుస్తారు' అంటూ వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యానించినట్టు సమాచారం. బొబ్బిలి సిట్టింగుకు మరోసారి అవకాశం ఇవ్వడం కష్టమేనని సాక్షాత్తు ఆ పార్టీ నాయకుల వాదన. రాజాంలో వైసిపికి పట్టుతగ్గినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనికితోడు టిడిపి నుంచి ధీటైన అభ్యర్థిని రంగంలోకి దింపే అవకాశాలు ఉండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేకి మరో అవకాశం ఇవ్వాలా? లేదా అన్నదానిపై లోలోపల ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. దీంతో, జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ముగ్గురు ఎమ్మెల్యే సీటు విషయంలో ముచ్చెమటలు పడుతున్నట్టుగా ప్రచారం నడుస్తోంది. మరోవైపు టిడిపి అధినేత చంద్రబాబు జైలులో ఉండడం, నారా లోకేష్ కూడా ఆ కేసుల నుంచి బయటపడే పనికి పరిమితం కావడంతో ఇదే అదునుగా జనంలోకి వెళ్లేందుకు వైసిపి భావిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల జగనన్న వైదార్యోగ శిబిరాలు నిర్వహించింది. ఈనెల 26 నుంచి సామాజిక న్యాయం పేరిట బస్సు యాత్రకు సన్నద్ధమౌతోంది. నవంబర్ 1నుంచి 'మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి ఎందుకు కావాలి' అంటూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రెండు కార్యక్రమాల సన్నాహక సమావేశాల్లో భాగంగానే టిక్కెట్లు ఖరారు చేయడం చూస్తుంటే వైసిపిలో ఎన్నికల హడావుడి ముమ్మరంగానే సాగుతున్నట్టుగా స్పష్టమౌతోంది.