Feb 28,2023 21:56

ఏకగ్రీవం కాకుండా ఫలించిన టిడిపి వ్యూహాం
స్వతంత్ర అభ్యర్థులు నలుగురు టిడిపి అనుకూలురే
వైసిపికి అధిక ఓట్లు ఉన్నప్పటికీ లోలోన గుబులు
టిడిపి, జనసేన ఒక్కటిగా ఎత్తుగడలు
క్యాంపు రాజకీయాల వైపు వైసిపి ఆలోచనలు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

అధికార వైసిపికి ఎంఎల్‌సి ఎన్నికల టెన్షన్‌ పట్టుకుంది. స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికలకు సంబంధించి రెండు స్థానాలను ఏకగ్రీవంగా సొంతం చేసుకోవాలనే ఎత్తుగడ బెడిసి కొట్టడంతో మంత్రులు, ఎంఎల్‌ఎలు తలలు పట్టుకుంటున్నారు. ఎంఎల్‌సి ఎన్నికలు ఏకగ్రీవం కాకుండా టిడిపి వేసిన ఎత్తుగడ ఫలించడంతో ఒక్కసారిగా రాజకీయ పరిస్థితులు మారాయి. రెండు ఎంఎల్‌సి ఎన్నికల స్థానాలకు సంబంధించి ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ఇద్దరు వైసిపి, నలుగురు టిడిపి అనుయాయులు. మార్చి 13న ఎంఎల్‌సి ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఈ ఎన్నికల్లో ఓటుహక్కు ఉపయోగించుకోనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,105 మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో వైసిపి ప్రజాప్రతినిధులు 870 మంది ఉండగా టిడిపి, జనసేన, ఇతరులు కలిపి 235 మంది వరకూ ఉన్న పరిస్థితి నెలకొంది. అత్యధిక ఓటర్లు కలిగిన వైసిపికే రెండు ఎంఎల్‌సి స్థానాలు సొంతం కానున్నాయి. ఎన్నికల పోరు అనివార్యం కావడంతో పరిస్థితులు ఏవిధంగా మారుతాయోననే భయం వైసిపిని వెంటాడుతోంది. టిడిపి ప్రత్యక్షంగా అభ్యర్థులను పోటీలోకి దింపకపోయినా వెనకుండి నడిపిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
అసంతృప్తి కొంప ముంచుతుందా..?
వైసిపి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో ప్రభుత్వం, పార్టీ తీరుపై సైతం అసంతృప్తి ఉన్నట్లు అంతా అంచనా వేస్తున్నారు. పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడం, ప్రజాప్రతినిధులకు పెద్దగా గౌరవం లభించకపోవడం వంటి అనేక కారణాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ అసంతృప్తిని తమవైపు తిప్పుకుని వైసిపిని దెబ్బకొట్టాలని టిడిపి, వైసిపి ఎత్తుగడలు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎంఎల్‌సి ఎన్నికల్లో మొదటి, ద్వితీయ ఓట్లు ప్రాధన్యత ప్రాతిపదికన ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలవాలంటే 553 వరకూ ఓట్లు రావాల్సి ఉంటుంది. టిడిపి, వైసిపి, ఇతరుల ఓట్లు దాదాపు 235 వరకూ ఉన్నాయి. మరో 320 ఓట్లు సాధించగలిగితే గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ కొంతమేర మొదటి ప్రాధాన్యత ఓట్లు తగ్గినా ద్వితీయ ప్రాధాన్యత ఓటు సాధించినా పరిస్థితులు తారుమారవుతాయని అంచనా వేస్తున్నారు. దీనికి తగినట్లుగా ప్రతిపక్ష నాయకులు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. టిడిపి సానుభూతిపరులు నలుగురు బరిలో ఉండటంతో ఏవిధంగా ముందుకు సాగుతారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకరిని మాత్రమే పోటీదారునిగా ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో జరిగిన ఎంఎల్‌సి ఎన్నికల్లో మేకా శేషుబాబు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అదే విధమైన వ్యూహాన్ని టిడిపి, జనసేన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వైసిపి స్థానిక ప్రజాప్రతినిధులను తమవైపు తిప్పుకునేవిధంగా వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.
క్యాంపు రాజకీయాలపై వైసిపి ఆలోచన..?
ఎంఎల్‌సి ఎన్నికలు అనివార్యం కావడంతో వైసిపి క్యాంపు రాజకీయాల వైపు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధులు చెదిరిపోకుండా ముందుగానే సమీకరించి ఒకచోట ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. ఎంఎల్‌సి ఎన్నికలకు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించడం, ఓటు ఎలా వేయాలో చెప్పడంతోపాటు ఏఒక్కరూ చెదిరిపోకుండా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎంఎల్‌సి ఎన్నికలు రసవత్తరంగా మారుతున్న పరిస్థితి నెలకొంది. స్వతంత్ర అభ్యర్ధులు గెలవకపోయినా ఓట్లు చీల్చగలిగితే వైసిపికి ఎదురుదెబ్బ తగిలినట్లుగానే ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఓట్లు చీలకుండా వైసిపి మంత్రులు, ఎంఎల్‌ఎలు తమ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నట్లు తెలుస్తోంది.