విజయనగరం ప్రతినిధి: ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైసిపిలో చీలికలు మొదలయ్యాయి. ఇతర పార్టీల్లోకి వెళ్లకపోయినప్పటికీ పలు నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు తారా స్థాయికి చేరాయి. పార్టీ జిల్లా నేత చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అసంతృప్తి జ్వాలలు చల్లారడం లేదు. భవిష్యత్తులో తారా స్థాయికి చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా శృంగవరపుకోట, నెల్లిమర్ల, సాలూరు నియోజకవర్గాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.
నెల్లిమర్ల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే వ్యవహారశైలిని నిరసిస్తూ నెల్లిమర్ల ఎంపిపి అంబళ్ల సుధారాణి తన పదవికి రాజీనామా చేస్తూ పార్టీకి అందజేశారు. ఆమె భర్త అంబళ్ల శ్రీరాములునాయుడు కూడా రైల్వే సౌత్ సెంట్రల్ బోర్డు సభ్యత్వ పదవి రాజీనామాకు సిద్ధపడుతున్నారనే చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో మండలంలో కొన్ని అభివృద్ధి పనులకు ఎంపిపి ప్రతిపాదన పెట్టగా, కొందరు సభ్యులు వ్యతిరేకించారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే వ్యతిరేకిం చారంటూ ఎంపిపి, ఆమె ఆనుయాయులు మనస్తాపానికి గురయ్యారని, అందువల్లే రాజనామాకు సిద్ధపడ్డారని ప్రచారం నడుస్తోంది. అసైన్డ్ భూముల వ్యవహారంలో కూడా ఎంపిపి భర్త శ్రీరాములు నాయుడు, ఎమ్మెల్యే మధ్య అంతర్గత పోరు నడుస్తోందని కూడా అక్కడక్కడ చర్చ సాగుతోంది. కారణాలు ఏవైనా ఏకంగా ఎంపిపి పదవికి రాజీనామా చేయ డం, ఆమె వైపు చాలా ఎక్కువ మంది నాయకులు నిలవడం ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారినట్టేనని పలువురు చెప్తున్నారు.
సాలూరు నియోజకవర్గంలోని పాచిపెంటలో వైసిపి నాయకుల మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారి గడపగడపకు వైసిపి ప్రభుత్వం కార్యక్రమాన్ని బహిష్కరించే వరకు వెళ్లింది. మండలంలో వైసిపి కీలక నాయకులుగా ఉన్న డోల బాబ్జీ, తటికాయల గౌరీశ్వరరావు వేర్వేరు గ్రూపులకు నాయకత్వం వహిస్తున్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయంగా ఒకరినొకరు ఓడించుకునే వరకూ వచ్చిందని ఆ మండలంలో బాహాటంగానే చర్చ నడుస్తోంది. బాబ్జీకి డిప్యూటీ సిఎం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న భావనతో గౌరీశ్వరరావుతో పాటు, పార్టీ మండల అధ్యక్షులు గొట్టాపు ముత్యాల నాయుడు, ఎంపిపి బడ్నాన ప్రమీల, పాచిపెంట వీరం నాయుడు (చినబాబు), చాలా మంది ఎంపిటిసి, సర్పంచులు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇటీవల బాబ్జీ, గౌరీశ్వరరావు కలిసి పనిచేయడం ఎంపిపి, పార్టీ మండల అధ్యక్షుని గ్రూపునకు మింగుడు పడడం లేదు. ఈ నేపథ్యంలో పాచిపెంటలో డిప్యూటీ సిఎం, జిల్లా పరిషత్తు చైర్మన్ చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు నిరాకరించారు. ఎంపిపి, పార్టీ అధ్యక్షులు, వారి అనుయాయులు నేతలిద్దరికీ స్వాగతం పలికి, అక్కడి నుంచి వెనుదిరిగారు. నేతలకే ఇలాంటి అనుభవం ఎదురవడంతో వివాదం తారా స్థాయికి చేరినట్టేనని పలువురు విశ్లేషిస్తున్నారు.
శృంగవరపుకోటలో చాలా కాలంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్సీ రఘురాజుకు వ్యతిరేకంగానూ శిబిరాలు నడుస్తున్నాయి. ఇటీవల జామి మండల పరిషత్తు సమావేశంలో ఎమ్మెల్సీ, జెడ్‌పిటిసి మధ్య వివాదం చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కొంతమంది సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి ఎమ్మెల్సీ వెళ్లినప్పటికీ మంత్రి బొత్స హెచ్చరికతో వెంటనే వెనుదిరిగారని ప్రచారం నడుస్తోంది. విజయనగరం నియోజకవర్గంలో ఇంకా బహిర్గతం కాకపోయినప్పటికీ కొంతమంది కార్పొరేటర్లు స్థానిక ఎమ్మెల్యే తీరుపై గుర్రుగా ఉన్నారన్న చర్చనడుస్తోంది. ఈనేపథ్యంలో వైసిపిలో అంతర్గత పోరు తారా స్థాయికి చేరుతోందనే వాదన గట్టిగానే వినిపిస్తోంది.










