Feb 14,2023 21:51


టిడిపిలో అణగదొక్కారు
కార్యకర్తలతో మాజీ ఎంఎల్‌ఎ జయమంగళ వెంకటరమణ
ప్రజాశక్తి - కైకలూరు

తెలుగుదేశం పార్టీలో నాయకులు తనను రాజకీయంగా అణగదొక్కారని, అందుకే అవమానాలు భరించలేక వైసిపిలో చేరుతున్నట్లు మాజీ ఎంఎల్‌ఎ జయమంగళ వెంకటరమణ తెలిపారు. ఆటపాకలోని తన నివాసం వద్ద మంగళవారం ఆయన తన అభిమానులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ రాజకీయాల్లో చంద్రబాబు, దిగువస్థాయి నాయకులు తనను మోసం చేసిన తీరును వివరించారు. టిడిపిలో ఉన్నంత వరకు శక్తి వంచన లేకుండా ఆస్తులు ఖర్చు చేసి పార్టీ కోసం పని చేశానన్నారు. తన వెంట ఉండే నాయకులే తనకు వెన్నుపోటు పొడిచి మానసికంగా ఇబ్బందులకు గురి చేశారన్నారు. తనను నమ్ముకున్న ప్రజలకు మేలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తనకు తల్లిదండ్రులు, భార్య లేరని, తాను సంపాదించిన మొత్తం కూడా పేదల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తానని తెలిపారు. తనపై అవినీతి ఆరోపణలు రుజువు చేస్తే ఉరేసుకొని చస్తానని ప్రకటించారు. వైసిపి ఎంఎల్‌ఎతో కలిసి పని చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. తన నిర్ణయం సరైనదని భావిస్తే తనతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో 2004 నుంచి తనకు జరిగిన అన్యాయాలను, అవమానాలను వివరించారు. ఈ సందర్భంగా టిడిపి సభ్యత్వానికి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవికి కార్యకర్తల సమక్షంలో రాజీనామా చేశారు. త్వరలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వద్దకు వెళ్లి వైసిపిలో చేరతానని వివరించారు.