ప్రజాశక్తి-అరకులోయ:అరకులోయ వైసీపీ పార్టీలో ఒకసారిగా విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే పాల్గుణ వ్యతిరేక వర్గీయులు వైసిపి రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ముందు విభేదాలు భగ్గుమన్నాయి. అరకులోయలోని పున్నమి వ్యాలీ రిసార్ట్స్‌లోని గోష్టిలో భాగంగా అరకు నియోజకవర్గంలోని వైసీపీ నేతలు కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ కలయిక సమావేశంలో పాల్గొనడానికి వైవి సుబ్బారెడ్డి బుధవారం సాయంత్రం అరకులోయ పున్నమికి చేరుకున్నారు. సుబ్బారెడ్డి రాకకు నిరీక్షించిన కొంతమంది వైసిపి కార్యకర్తలు అరుకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ వ్యతిరేక వర్గీయులు వైవి సుబ్బారెడ్డి వాహనం దిగిన వెంటనే అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ వద్దు- జగన్ ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి గుమ్మిగూడారు. దీంతో, ఒక్కసారిగా వైసిపి ఇరువర్గాల్లో కలవరం మొదలై గందరగోళ పరిస్థితి ఏర్పడింది.ఇరు వర్గాల మధ్య కొంతసేపు తోపులాట చోటుచేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు జోక్యం చేసుకొని వెంటనే ఇరు వర్గాల వారికి సర్ది చెప్పి సభ సజావుగా సాగేలాగా చేశారు. దీంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదిలా ఉండగా అంతకుముందు పార్టీ కార్యకర్తల మధ్యనే ఫ్లెక్సీలు పెట్టే విషయంలో నాది ముందు ఉండాలంటే మాది ముందు ఉండాలంటూ ఘర్షణ పడ్డారు. వైసిపి ఇరువర్గంలో వర్గ విభేదాలు బయట పడటంతో ముందు ముందు అరకు వైసిపిలో పరిస్థితి ఎలా ఉంటుందని అందరూ తలలు పట్టుకుంటున్నారు.










