
ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్ : వైసిపికి రోజులు దగ్గరపడ్డాయని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పుట్టపర్తి తెలుగుదేశం కార్యాలయంలో నిర్వహించిన రిలే దీక్షలు గురువారానికి తొమ్మిదవ రోజుకు చేరుకున్నాయి. నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీలు రిలే నిరాహార దీక్షకు పెద్ద సంఖ్యలో నాయకులుహాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో అన్ని పార్టీల నాయకులు చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదని చెబుతుంటే జగన్ మాత్రం తన వికృత చేష్టలు వీడలేదన్నారు. పుట్టపర్తి నియోజకవర్గ పరిశీలకులు బచ్చాల పుల్లయ్య మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. కక్ష సాధింపు ధోరణలతో టిడిపి నాయకులను జైలులో ఉంచి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల కన్వీనర్లు రామాంజనేయులు, విజరు కుమార్, సామకోటి ఆదినారాయణ, శ్రీరామి రెడ్డి, శ్రీరామ నాయక్, అంబులెన్స్ రమేష్, మనోహర్, బొమ్మయ్య, పుల్లప్ప,మహమ్మద్ రఫీ, బుక్కపట్నం కొత్తచెరువు పుట్టపర్తి, నల్లమాడ, ఒడిసి మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం :చంద్రబాబు అరెస్టు తరువాత వైసిపి నాయకుల వెన్నులో వణుకు మొదలైందని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా రామగిరి మండలం పేరూరులో రాప్తాడు నియోజకవర్గ తెలుగు మహిళల ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత ఈ దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం మహిళలతో కలిసి పేరూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబును అనవసరంగా అరెస్టు చేయించామన్న భయం వైసిపి నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వేలాది మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడమే చంద్రబాబు చేసిన నేరమా అంటూ పరిటాల సునీత ప్రశ్నించారు. సీఐడీ అధికారులు వాస్తవాలు పట్టించుకోకుండా సీఎం జగన్ రెడ్డి చెప్పినట్టుగా కేసులు పెడుతున్నారన్నారు. అసెంబ్లీలో నందమూరి బాలకష్ణ పై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల మీద తీవ్రంగా స్పందించారు. అంబటి రాంబాబు తన శాఖ గురించి తప్ప ప్రతిపక్షాలను తిట్టడానికి పరిమితమయ్యారని విమర్శించారు. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పేరూరు జలాశయానికి నీరు ఇస్తానని ప్రగల్భాలు పలికారని.. కానీ ఆయన చేసింది ఏమి లేదని సునీత అన్నారు. తాము గతంలో తీసుకొచ్చిన ప్రాజెక్టులను రద్దు చేసి ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. ఎమ్మెల్యే సోదరులు చేసిన అక్రమాలపై ఖచ్చితంగా విచారణ జరుగుతుందన్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఆయన కచ్చితంగా బయటకు వస్తారని అప్పటివరకు పోరాటం ఆప కూడదని పరిటాల సునీత సూచించారు.
ధర్మవరం టౌన్ :ఓటమి భయంతోనే సీఎం జగన్ టీడీపీ అధినేత చం ద్రబాబునాయుడుపై తప్పుడు కేసులు బనాయించారని టీడీపీ ఎస్సీసెల్ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలేనిరాహారదీక్షలో టీడీపీ ఎస్సీసెల్ నాయకులు పాల్గొన్నారు. ఈ దీక్షల్లో రామగిరి ఎస్సీసెల్ నాయకులు ముత్యాలు, ధర్మవరం ఎస్సీసెల్ నాయకులు కేశగాళ్ల శ్రీనివాసులు, గుజ్జల రామాంజినేయులు, కేశగాళ్ల వెంకటేశ్, సుబ్బరాయుడు, వెంకటరాముడు, పోతన్న, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
పుట్టపర్తి క్రైమ్ : చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ చేపట్టిన నిరాహార దీక్షలు గురువారానికి 9 వ రోజుకు చేరుకున్నాయి. గురువారం పుట్టపర్తి పట్టణంలోని టిడిపి కార్యాలయం ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు నిరసన దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, మైనార్టీ నాయకుడు మహమ్మద్ రఫీ, నాయకులు శ్రీరామ్ రెడ్డి, బివి ప్రసాద్, అంబులెన్స్ రమేష్, మాల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
కదిరి టౌన్ : చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టి లబ్ధిపొందాలనుకోవడం వైసిపి మూర్ఖత్వమని నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి కందికుంట వెంకటప్రసాద్ విమర్శించారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ కందికుంట అధ్వర్యంలో గురువారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కక్ష గట్టి చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తప్పక బుద్ధి చెబుతారన్నారు. అనంతరం అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ పోస్ట్ కార్డు పై సంతకాలు చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు మోపురి శెట్టి చంద్రశేఖర్, రాజశేఖర్ బాబు, బంగారు కృష్ణమూర్తి, డైమండ్ ఇర్ఫాన్, రమణ, గంగయ్య నాయుడు, బండారు మనోహర్ నాయుడు, మహిళా నాయకురాలు పర్వీన్ భాను, పీటల రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.