Sep 20,2023 23:03

గుంటూరులో మాట్లాడుతున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : వచ్చే ఎన్నికల్లో వైసిపికి ప్రజలు బుద్ధి చెబుతారని మాజీ మంత్రి, టిడిపి రాష్ట్ర బిసి విభాగం అధ్యక్షులు కొల్లు రవీంద్ర అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు టిడిపి జిల్లా బిసి విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్‌ అధ్యక్షత వహించారు. వివిధ వృత్తులకు సంబంధించిన బిసిలు వారివేషధారణలో బాబుకు తోడుగా మేము సైతం అని దీక్షలో పాల్గొన్నారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సిఎం కావడం ఖాయం అన్నారు. చంద్రబాబుని జైల్లో పెట్టి ఆనందపడుతున్న జగన్‌ ఎన్నికలలో ఓటమి తరువాత నిద్రలేని రాత్రులు గడిపేపరిస్థితి వస్తుందన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే బిసిలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామన్నారు. కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై ప్రజల్లోనూ, దేశవిదేశాల్లోనూ పోరాటాలు చేస్తున్నారన్నారు. వైసిపి ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పే సమయం వచ్చిందన్నారు. గుంటూరు తూర్పు ఇంచార్జి మొహమ్మద్‌ నసీర్‌ మాట్లాడుతూ చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఆధారాలు లేని కేసులో రిమాండ్‌ విధించి జైలుకు పంపించడం బాధాకరమన్నారు. గుంటూరు జిల్లా బిసి విభాగం అధ్యక్షుడు వేములకొండ శ్రీనివాస్‌, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌ , జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, టిడిపి నాయకులు సింహాద్రి కనకాచారి, నిమ్మల శేషయ్య, తాళ్ళ వెంకటేష్‌ యాదవ్‌,గాలం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.