
ప్రజాశక్తి-కె.కోటపాడు
వైసిపికి ప్రజల్లో ఆదరణ చెక్కు చెదరలేదని ముఖ్యమంత్రిగా వైఎస్.జగన్మోహన్‌రెడ్డి పాలన ఇకముందు కూడా కొనసాగుతుందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. మండలంలో మేజర్ పంచాయతీ చౌడువాడ ఎస్‌సి కాలనీ తదితర ప్రాంతాల్లో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. అన్ని శాఖల అధికారులను వెంటబెట్టుకుని ఉదయం 8 గంటల నుండి గతంలో మిగిలి ఉన్న 360 గృహాలకు వెళ్లి వాళ్ల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక కారణాలతో ఆగిన పథకాలను అక్కడికక్కడే అధికారులు దగ్గరుండి లబ్ధి పొందే విధంగా చర్యలు తీసుకున్నారు. ఎస్సీ కాలనీలో వాసుల అభ్యర్థన మేరకు కమ్యూనిటీ హాల్‌ను మంజూరు చేశారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి రూ.4.68 కోట్లు మంజూరు చేశారు. జగనన్న కాలనీలో మరో 58 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు అనుసంధానం చేస్తూ తారు రోడ్ల సదుపాయం కల్పించమని, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి వేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్, రమేష్ బాబు, ఎంపీడీవో, శచీదేవి, ఎంపీపీ రెడ్డి జగన్మోహన్, ఎంపీటీసీలు, సర్పంచులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.