స్థానిక సంస్థల రెండు ఎంఎల్‌సి స్థానాలు కైవసం
మొదటి ప్రాధాన్యతా ఓటుతోనే సునాయాసంగా గెలుపు
ప్రతిపక్షాల ఓట్లు అధికారపక్షం ఖాతాలోకే
ఈ గెలుపు జగన్ పాలనకు నిదర్శనం
విజేతలు కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాధ్
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు ఎంఎల్‌సి స్థానాలను వైసిపి కైవసం చేసుకుంది. శాసనమండలి సభ్యులుగా వైసిపి అభ్యర్థులైన జెడ్‌పి ఛైర్మన్ కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాధ్ గెలుపొందారు. ఈ నెల 13న స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు గురువారం ఏలూరు ఎంపిడిఒ కార్యాలయంలో జరిగింది. ఉదయం ఎనిమిది గంటలకు అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరిచి ఐదు టేబుళ్లపై ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఓట్ల లెక్కింపు చేపట్టిన గంట వ్యవధిలోనే ఫలితాలు వెలువడ్డాయి. వైసిపి అభ్యర్థి కవురు శ్రీనివాస్ మొదటి ప్రాధాన్యతా ఓట్లు 481 సాధించగా, మరోఅభ్యర్థి వంకా రవీంద్రనాథ్ 460 సాధించారు. టిడిపి బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి వీరవల్లి చంద్రశేఖర్‌కు 122 ఓట్లు లభించాయి. మిగిలిన స్వతంత్ర అభ్యర్థులు గోరింక దాసు, దేవరపల్లి ఆదాం, పసల వెంకటాచలంకు ఒక్క ఓటు కూడా రాలేదు. స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికలకు సంబంధించి మొత్తం 1,105 ఓట్లకుగాను 1088 ఓట్లు పోలయ్యాయి. వాటిలో 1,063 ఓట్లు చెల్లుబాటయ్యాయి. 25 ఓట్లు చెల్లనివిగా తేలాయి. చెల్లుబాటైన 1,063 ఓట్లలో 941 ఓట్లు మొదటి ప్రాధాన్యతగా వైసిపికే దక్కాయి. దీంతో వైసిపి అభ్యర్థుల గెలుపు ఖరారైంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఎంఎల్‌సి ఎన్నికల పరిశీలకులు, రాష్ట్ర్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్, ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్నవెంకటేష్, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, రిటర్నింగ్ అధికారి పి.అరుణ్‌బాబు ఓట్ల లెక్కింపును పరిశీలించారు.
విజేతలకు ధ్రువీకరణ పత్రాలు అందజేత
ఉదయం తొమ్మిది గంటలకే ఫలితాలు వెల్లడైనప్పటికీ మధ్యాహ్నం వరకూ అధికారికంగా వెల్లడించలేదు. గురువారం మధ్యాహ్నం అధికారికంగా ఫలితాలు ప్రకటించారు. ఎంఎల్‌సిలుగా గెలుపొందిన కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్‌లకు రిటర్నింగ్ అధికారి పి.అరుణ్‌బాబు ధ్రువీకరణపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా విజేతలను ఏలూరు ఎంఎల్‌ఎ ఆళ్ల నాని, ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్‌ఎంఆర్.పెదబాబు తదితరులు పుష్పగుచ్చాలు అందించి అభినందించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో డిఆర్‌ఒ ఎవిఎన్‌ఎస్.మూర్తి, ఆర్‌డిఒలు కె.పెంచల్‌కిషోర్, దాసి రాజు, డిఆర్‌డిఎ పీడీ విజయరాజు, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ మధుసూదనరావు, డ్వామా పీడీ రాంబాబు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ రామకృష్ణ, తహశీల్దార్ సోమశేఖర్ పాల్గొన్నారు.
మెరుగైన పాలనకు నిదర్శనమే ఈ గెలుపు
కవురు శ్రీనివాస్
పేద ప్రజలకు నవరత్నాల పేరుతో ఎన్నో పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. కులమతాలకు అతీతంగా పథకాలు అందిస్తోంది. మెరుగైన పాలనకు బహుమతిగా దక్కిందే ఈ గెలుపు. ప్రతిపక్ష పార్టీల ఓట్లు కూడా మాకు పడటమే దీనికి నిదర్శనం.
ఈ విజయం జగన్ సంక్షేమ పాలనకు నిదర్శనం
వంకా రవీంద్రనాధ్
రాష్ట్రంలో ప్రజలకు జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలితమే ఎంఎల్‌సి ఎన్నికల్లో విజయం. ప్రతిపక్షపార్టీల ఓటర్లు కూడా తమకే ఓటు వేయడం అందుకు నిదర్శనం. టిడిపికి మద్దతు లేదని తెలిసి స్వతంత్ర అభ్యర్థిని రంగంలోకి దింపి మద్దతిచ్చారు. ఈ తీరు దారుణం. స్థానిక సంస్థల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తాను.
ప్రతిపక్షాల ఓట్లు వైపిపికే
స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికలకు సంబంధించి మొత్తం 1,105 ఓట్లు ఉండగా వీటిలో 920 ఓట్లు వైసిపికి చెందినవారే. 185 మంది టిడిపి, జనసేన, ఇతర పార్టీలు, స్వతంత్రులైన ప్రజాప్రతినిధులు ఉన్నారు. అధిక ఓట్లు ఉన్న వైసిపికి రెండుస్థానాలు ఏకగ్రీవంగా దక్కాల్సి ఉంది. అయితే టిడిపి నలుగురు స్వతంత్ర అభ్యర్థులను రంగంలోకి దింపింది. వీరిలో వీరవల్లి చంద్రశేఖర్‌కు టిడిపి అధికారికంగా మద్దతు ప్రకటించింది. అధికార పార్టీకి సంబంధించిన ఓట్లు చీలితే స్వతంత్ర అభ్యర్థి గెలుపు ఖాయమనే ప్రచారం సాగింది. మొత్తం 1,088 ఓట్లు పోలవగా వీటిలో వైసిపి అభ్యర్థులకు 941, టిడిపి బలపర్చిన స్వతంత్ర అభ్యర్థికి 122 ఓట్లు వచ్చాయి. అంటే ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓటర్లు సైతం వైసిపి అభ్యర్థులకే ఓటేసినట్లు తేటతెల్లమైంది.
అధికార పార్టీకి కలిసొచ్చిన డబ్బు పంపిణీ
స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవడంతో వైసిపిలో గుబులు మొదలైంది. దీంతో తమ ఓటర్లను కాపాడు కునేందుకు నియోజకవర్గాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. తమకు డబ్బులిస్తేనే ఓటు వేస్తామనే డిమాండ్ వ్యక్తమవడంతో వైసిపి నాయకులు కంగుతిన్నారు. డబ్బు పంపిణీ చేయకపోతే ఓట్లు చీలి స్వతంత్ర అభ్యర్థికి వెళ్లే అవకాశం ఉందని అంచనా వేశారు. దీంతో ఓటుకు రూ.20 వేలు చొప్పున అధికార పార్టీ తమ సొంత ఓటర్లకు పంపిణీ చేయాల్సి వచ్చింది. ప్రతిపక్ష పార్టీల ఓటర్లకు కూడా డబ్బు పంపిణీ చేశారు. ఆ కారణంగానే ప్రతిపక్ష పార్టీల ఓటర్లు కూడా వైసిపి అభ్యర్థులకే ఓటు వేసినట్లు తెలుస్తోంది. రెండు స్థానాలను వైసిపి కైవసం చేసుకోవడంతో వైసిపి శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి.
టేబుళ్ల వారీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు
అభ్యర్థి పేరు టేబుల్-1 టేబుల్-2 టేబుల్-3 టేబుల్-4 టేబుల్-5 మొత్తం
కవురు శ్రీనివాస్ 45 96 76 151 113 481
వంకా రవీంద్ర 130 72 87 80 91 460
వి.చంద్రశేఖర్ 23 24 33 15 27 122
చెల్లని ఓట్లు 2 8 4 4 7 25
మొత్తం చెల్లుబాటు అయిన ఓట్లు: 1063
చెల్లనివి: 25
స్వతంత్ర అభ్యర్థులు: గోరింక దాసు, దేవరపల్లి ఆదాము, పసల వెంకటాచలంకు ఒక్క ఓటు కూడా రాలేదు.










