Nov 03,2023 00:40

మాట్లాడుతున్న టిడిపి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు

ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌ : వైసిపి సింగిల్‌ డిజిట్‌ దాటితే గొప్పేనని మాజీమంత్రి, ఉత్తర ఎమ్మెల్యే నియోజకవర్గ గంటా శ్రీనివాసరావు అన్నారు. గురువారం టిడిపి జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు రాజమండ్రి నుంచి విజయవాడ చేరుకోవడానికి 14 గంటల సమయం పట్టిందన్నారు. అర్ధరాత్రి సమయంలో ప్రజలు చంద్రబాబు కోసం బారులుతీరారన్నారు. హైదరాబాద్‌లో కూడా అదే ఆదరణ అన్నారు. నిజమైన నాయకుడికి ఘనమైన స్వాగతం లభించిందన్నారు. దీనిని వైసిపి నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని పేర్కొన్నారు. జైలు నుంచి వచ్చిన చంద్రబాబు గురించి సజ్జల హీనంగా మాట్లాడటం దారుణమన్నారు. జైలులోనే చంద్రబాబు చస్తారని వైసిపి ఎంపీ మాట్లాడారని, దీన్ని బట్టి వైసిపి నేతల పరిస్థితి అర్థం అవుతుందన్నారు. పోలవరంతో పాటు ఒక్కటంటే ఒక్క ఇరిగేషన్‌ ప్రాజెక్టు కట్టలేని జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు అంతర్జాతీయ సదస్సును విశాఖలో పెట్టుకున్నారని, దీనికి ఆయన సిగ్గుపడాలన్నారు. చంద్రబాబుపై స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు నిలబడదని తెలిసి సిఐడి వేరే కేసులపై దృష్టి పెట్టిందని ఆరోపించారు. మోడీకి మసాజ్‌ చేయడానికి సిఎం ఢిల్లీ వెళ్తున్నాడు తప్ప ఎపికి ఏమీ ఉపయోగం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పార్లమెంట్‌ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి, ఉత్తర ఇన్చార్జి చిక్కాల విజయబాబు, రజక కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ రాజమండ్రి నారాయణ, మాజీ ఎమ్మెల్సీ శివకుమారి పాల్గొన్నారు.