Aug 19,2023 20:38

మాట్లాడుతున్న ఇంటూరి నాగేశ్వరరావు

ప్రజాశక్తి-కందుకూరు :రాష్ట్రంలో జరిగిన పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచ్‌ ఎన్నికల్లో టిడిపి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవటమే టిడిపి బలానికి నిదర్శమని కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరు నాగేశ్వరరావు తెలిపారు. శనివారం ఆయన ఇక్కడ విలేకర్లతో మాట్లాడారు. వైసిపి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ఎన్నికల ఫలితాలు నిదర్శనమన్నారు. కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు మండలం ఆత్మకూరు, లింగసముద్రం మండలం చిన్నపవని పంచాయతీ వార్డు సభ్యులకు జరిగిన ఎన్నికల్లో టిడిపి బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారన్నారు. చిన్నపవని గ్రామంలో వార్డు కు జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేయనందుకు ఓ రైతును వేధింపులకు గురి చేసారని చెప్పాడు. సొసైటీలో రైతుకు ఉన్న అప్పుని సాకుగా తీసుకొని అతని పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా ప్రచారం చేయడంతో పాటు ఉన్న బాకీ లో కొంత కడతానని బ్యాంకుకు వెళ్లి అడగగా అట్రాసిటీ కింద రైతుపై కేసు నమోదు చేయడం దారుణమన్నారు. కందుకూరు మండలం కొండడుసుపాలం సర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు చేయడానికి శాసనసభ్యులు రెకమండేషన్‌ చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చన్నారు. సర్పంచ్‌ దళిత మహిళ అనే విషయాన్ని కూడా లెక్కలోకి తీసుకోకుండా చెక్‌ పవర్‌ రద్దుకు సిఫారసు చేసిన పరిస్థితిని నాగేశ్వరరావు వివరించారు. కందుకూరు నియోజకవర్గంతోపాటు రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో టిడిపి విజయం ఖాయమని మాజీ శాసనసభ్యులు డాక్టర్‌ దివి శివరాం చెప్పారు. టిడిపి నాయకులు దామా మల్లేశ్వరరావు, ఎన్‌ వి సుబ్బారావు, బెజవాడ ప్రసాద,్‌ చిలకపాటి మధు, షేక్‌ రఫీ ఉన్నారు.