వైసిపి ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమ లేదు..
- వచ్చే ఎన్నికల్లో వైసిపి చిత్తుగా ఓడిపోవడం కాయం
- మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
వైసిపి ప్రభుత్వంలో కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఒక్క పరిశ్రమ కూడా తేలేదని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిఎంపై నిప్పులు చెరిగారు. బాబు షూరిటీ-భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నంద్యాలలోని రాజ్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. రాయలసీమ సస్యశామలం కోసం తెలుగుదేశం హయాంలో పూర్తి చేసిన ప్రాజెక్ట్‌ల ద్వారా కాలువలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందన్నారు. సిఎం జగన్ రాయలసీమ ద్రోహి అని, కరుడు గట్టిన నేరస్తుడని, ప్రజల రక్తం తాగుతున్నాడని, అన్ని రంగాలు దెబ్బ తింటున్నాయని, రోడ్లు సరిగ్గా లేవని, అన్ని ప్రభుత్వ శాఖలకు హాలిడే ప్రకటించారని అన్నారు. నంద్యాలలో సలాం కుటుంబం చనిపోయినప్పుడు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. నంద్యాలలో సండే ఎమ్మెల్యే తన అనుచరులకు ఎర్రమట్టి, బియ్యం, అన్ని కూడబెడుతూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని తెలిపారు. సైకో జగన్‌ను ఇంటికి సాగనంపాలన్నారు. నంద్యాలకు పూర్వ వైభవం రావాలంటే టిడిపిని గెలిపించాలని ప్రజలను కోరారు. బహిరంగ సభ అనంతరం ఆర్‌కె ఫంక్షన్ హాల్‌లో చంద్రబాబునాయుడు రాత్రి బస చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల నియోజకవర్గ ఇన్చార్జి భూమా బ్రహ్మానంద రెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యులు ఎన్‌ఎండి ఫరూక్, మాజీ మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, భూమా అఖిల ప్రియ, జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, నాయకులు ఎవి సుబ్బారెడ్డి, ఎన్‌ఎండి ఫిరోజ్, మౌలానా ముస్తాక్ అహ్మద్, భూమా జగత్ విఖ్యత్ రెడ్డి, తాతిరెడ్డి తులసి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భారీ గజమాలతో స్వాగతం పలికిన టిడిపి నాయకులు
చంద్రబాబు నాయుడుకు నంద్యాల బైపాస్ టర్నింగ్ వద్ద టిడిపి నాయకులు భారీ గజమాలతో స్వాగతం పలికారు. మాజీ మంత్రి ఫరూఖ్, మాజీ ఎమ్మెల్యేలు భూమా బ్రహ్మానంద రెడ్డి, జయనాగేశ్వర రెడ్డి, ఎవి సుబ్బారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు వెదుర్ల రామచంద్రరావు, ఏవిఆర్ ప్రసాద్, నంద్యాల పరిశీలకులు పోతురాజు రవికుమార్, జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండి ఫిరోజ్, న్యాయవాది తులసిరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.










