Apr 02,2023 00:09

మాట్లాడుతున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

ప్రజాశక్తి-గొలుగొండ:వైసిపి ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో సాగనంపాలని మాజీ మంత్రి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. శనివారం సాయంత్రం మండలంలోని పుత్తడిగైరంపేట, పాకలపాడు గ్రామాల్లో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జరిగిన సభల్లో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, వైసిపి అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. వైసిపి పాలనలో ఏ వర్గానికి చెందిన ప్రజలు కూడా సంతోషంగా లేరన్నారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కడమే పనిగా పెట్టు కుందన్నారు. ప్రభుత్వ పాలనను ప్రశ్నించినందుకే తనపై అక్రమ కేసులకు పూనుకున్నారని, ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదన్నారు. రాష్ట్రం బాగు కోసం మళ్లీ తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వైసిపి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు గట్టి బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు, పార్టీ సీనియర్‌ నాయకులు చిటికెల సాంబమూర్తి, సుర్ల బాబ్జి, చోద్యం సర్పంచ్‌ కొల్లు రాంబాబు, మాజీ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ కొల్లు సత్తిబాబు, స్థానిక నాయకులు రూపల నాయుడు, నారాయణమూర్తి, కామిరెడ్డి రామన్న, బొడ్డు సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.