Jul 30,2023 22:11

         తరాలు మారుతున్నాయి.. కానీ గీతన్నల రాతలు మార్చే పాలకులు రావడం లేదు. వారి వృత్తికి సరైన గ్యారంటీ లేదు. జీవితాలకు భద్రత లేక కటుంబాలు అగమ్యగోచరంగా ఉన్నాయి. దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం గీతన్నలను గాలికొదిలేసింది. గీత వృత్తినే నమ్ముకున్న కుటుంబాలకు శాశ్వత పరిష్కారం చూపడం లేదు. గీతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో నాలుగు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రభుత్వ సహకారం లేకపోయినా, ప్రమాదకరమైన వృత్తి అయినా కుటుంబ పోషణ కోసంవృత్తి చేస్తున్నారు. ఈ వృత్తిలో ప్రతియేటా వందలాది మంది ప్రమాదాలకు గురవుతున్నారు. అనేక మంది చనిపోతున్నారు. కాళ్లు, చేతులు విరగడం, నడుం పడిపోవడం జరుగుతున్నాయి. వృత్తిలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటూనే గీతకార్మికులు ధైర్యంగా ముందుకెళ్తున్నారు. రాజకీయ పార్టీలు ఇప్పుడైనా గుర్తించాల్సిన ముఖ్యమైన అంశం.. గీత కార్మికులకు ఇన్ని ప్రమాదాలు జరిగినా గుర్తించకపోవడం బాధాకరం.
     ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నాడు పాదయాత్రలో మోకు భుజాన వేసుకుని గీత కార్మికులకు ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలు ఏ ఒక్కటీ అమలు చేయకపోగా వృత్తిని దారుణంగా దెబ్బతీశారు. గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశైన, యాత ఒక్కటిగా ఉన్న కల్లు గీత కులాలను చీల్చి అప్పులు తెచ్చుకోవడం కోసం కులాలవారీ కార్పొరేషన్లు పెట్టి ఛైర్మన్లు, డైరెక్టర్లను నామినేట్‌ చేసి కొంతమందికి రాజకీయ భృతి కల్పించారు. నిధులు, విధులు లేని కులాల కార్పొరేషన్లు గీత కార్మికుల కొంపలు ముంచడానికి తప్ప వాటివల్ల ఎటువంటి ఉపయోగమూ లేదు. గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, వృత్తిలో ప్రమాదం జరిగినా వారికి ఆర్థిక సహకారం కోసం 1991లో ఉమ్మడి రాష్ట్రంలో పోరాడి సాధించుకున్న కల్లుగీత కార్పొరేషన్‌కు నిధులు కేటాయించకుండా మూసేసిన ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కింది. తాము అధికారంలోకి వస్తే దశలవారీ మద్యనిషేధం విధిస్తామని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం చీప్‌ లిక్కర్‌ ఎనీటైం, ఎక్కడబడితే అక్కడ విచ్చలవిడిగా అమ్మిస్తూ కల్లు అమ్మకాలను పూర్తిగా దెబ్బతీసింది. హర్యానా, గోవా, కర్నాటక, యానాం, అస్సాం తదితర రాష్ట్రాల నుండి అక్రమ మద్యం వరదలా మన రాష్ట్రానికి వస్తున్నా ప్రభుత్వం అరికట్టలేకపోతుంది. నాటుసారా, మొబైల్‌ బెల్టుషాపులు యథేచ్ఛగా నడుస్తున్నాయి. మద్యం, చీప్‌లిక్కర్‌ దెబ్బకు కల్లు అమ్మకాలు లేక గీత కుటుంబాలు విలవిల్లాడుతున్నాయి. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో గీత వృత్తిని, సంక్షేమం, ఉపాధి, వృత్తి రక్షణ వగైరా గురించి వైసిపి ప్రభుత్వం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రభుత్వ విధానాల వల్ల ఈ రోజు నమ్ముకున్న వృత్తిలో బతకలేని పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రరాష్ట్రంలో వృత్తిలో బతకలేక నగరాలకు, ఇతర దేశాలకు వలసలు పోతున్నారు. విసుగు చెందిన సీనియర్‌ గీత కార్మికులు మన వృత్తికి ఇదేం ఖర్మ అంటూ ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని అంటున్నారు. కల్లుగీత సామాజిక తరగతులకు చెందిన ఎంఎల్‌ఎలు, ఎంపీలు, మంత్రులు తాము ఇన్ని అవమానాలకు గురౌతుంటే ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారని గీత కార్మికులు మదన పడుతున్నారు. పదవులను కాపాడుకోవడం కోసం కులాలను చీల్చడం, గీత కార్మికులను అవమానాలు పాల్జేయడం మంచిది కాదు. ప్రభుత్వానికి గీత కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మన పక్క రాష్ట్రాలు ఆదుకున్నట్లుగా పథకాలు ప్రవేశపెట్టి ఉపాధి అవకాశాలు పెంచేలా చర్యలు చేపట్టాలి.
2022 అక్టోబరు 31న ఎక్స్‌గ్రేషియో పది లక్షలు ఇస్తామని ఆర్భాటంగా ప్రభుత్వం ప్రకటించి తొమ్మిది నెలలైనా విధివిధానాలు ప్రకటించ లేదు. తాటి, ఈత చెట్లు నరికి వేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. చెట్లకు రక్షణ కల్పించాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తి ఆధునికీకరణ చేసే విధంగా ఆలోచించాలి. వృత్తి రక్షణ, సామాజిక భద్రత కల్పించాలి. నీరా, తాటి ఉత్పత్తుల పరిశ్రమలు నెలకొల్పాలి. కల్లుగీత కార్పొరేషన్‌ను పునరుద్దరించి గీత కార్మికుల సంక్షేమానికి రూ.ఐదు వేల కోట్లు కేటాయించాలి. వృత్తిలో ప్రమాదాలు నివారించేందుకు సేఫ్టీ మోకులు తయారు చేయించి ఉచితంగా ఇవ్వాలి. ఎక్కడ ప్రమాదాలకు గురై చనిపోయినా, అంగవైకల్యానికి గురైనా ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలి. గీత కార్మికులందరికీ ప్రమాదబీమా చెల్లించి, వైఎస్‌ఆర్‌ గీత కార్మిక భరోసా ఇవ్వాలి. వృత్తిలో ప్రమాదవశాత్తు దెబ్బలు తగిలిన వారికి వైద్య ఖర్చులకు రూ.15 వేలు, చనిపోయిన వారి దహన ఖర్చులకు రూ.25 వేలు కార్పొరేషన్‌ నుండి తక్షణమే ఇవ్వాలి. వృత్తి చేసే వారందరికీ ద్విచక్ర వాహనాలు ఇవ్వాలి. వృత్తి లేని సమయంలో 50 శాతం సబ్సిడీపై రూ.2 లక్షలు ఇవ్వాలి. కల్లుకు మార్కెట్‌ సౌకర్యం కల్పించాలి. తాటి, ఈత చెట్లు పెంచుకునేందుకు సొసైటీలకు జిఒ 560 ప్రకారం ఐదెకరాల భూమి ఇవ్వాలి. తాటి, ఈత, ఖర్జూర తదితర కల్లునిచ్చే పొట్టిచెట్లు ప్రభుత్వమే ఇవ్వాలి.
కల్లుగీత కార్మిక సంఘం ఉద్యమ నిర్మాత ఎస్‌ఆర్‌.దాట్ల 44వ వర్థంతి స్ఫూర్తితో గీత కార్మికులు ఐక్యంగా పోరాడాలి. పోరాడితేనే వృత్తిని రక్షించుకోగలం. ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టగలం.
-జుత్తిగ నరసింహమూర్తి,
ఎపి కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు
నేడు ఎస్‌ఆర్‌ దాట్ల 44వ వర్థంతి సభ

              పెనుమంట్ర:ఎస్‌ఆర్‌ దాట్ల 44వ వర్థంతి సభ ఈ నెల 31న పెనుమంట్రలో నిర్వహించనున్నట్లు సిపిఎం మండల కూసంపూడి సుబ్బరాజు తెలిపారు. ఆయన 44వ వర్థంతిని పురస్కరించుకుని బ్రాహ్మణచెరువులో చింతపల్లి శ్రీరాములు స్మారక బస్టాండ్‌ నుండి పెనుమంట్ర ఎస్‌ఆర్‌ దాట్ల స్తూపం వరకు ప్రదర్శన నిర్వహిస్తామని పేర్కొన్నారు. స్తూపం వద్ద నిర్వహించే సభను జయప్రదం చేయాలని, ఈ సభకు ముఖ్యవక్తలుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, జిల్లా కార్యదర్శి బి.బలరాం, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జుత్తిగ నరసింహమూర్తి, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కేతా గోపాలన్‌, రైతుసంఘం జిల్లా కార్యదర్శి ఆకుల హరేరాం పాల్గొంటారని తెలిపారు. ఎస్‌ఆర్‌ దాట్ల మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ ఈ లిమిటెడ్‌ ఎమ్‌డి మహిమ దాట్ల సహకారంతో ఉచిత మందులు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌సి అంగర రామ్మోహన్‌రావు, జెడ్‌పిటిసి సభ్యులు కర్రి గౌరీసుభాషిణి, సర్పంచి తాడిపర్తి ప్రియాంక, ఎస్‌ఆర్‌ దాట్ల ట్రస్ట్‌ సభ్యులు చిలుకూరి రాఘవరావు పాల్గొంటారని తెలిపారు. మార్టేరుకు చెందిన సాయి వెంకటేశ్వర హాస్పిటల్‌ డాక్టర్‌ కె.సాయిహర్ష సలహాల మేరకు మందులు ఇస్తామని పేర్కొన్నారు.