Oct 09,2023 23:41

ప్రజాశక్తి - బాపట్ల
టిడిపిలో ఉన్నత పదవులు అనుభవించి తిరిగి వైసిపి పంచన చేరి స్కిల్ స్కాం సొమ్ము బాపట్లకి చేరిందని ఆ నాయకుడు ఆరోపించడం ఆయన పెద్దరికానికి తగదని టిడిపి ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్రవర్మ అన్నారు. టిడిపి కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానికంగా ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాంకు సంబంధించి చంద్రబాబుపై ఆరోపణలు చేయటాన్ని వర్మ ఖండించారు. స్కిల్ స్కాంకు సంబంధించి ఆధారాలన్ని ఆ నాయకుడి దగ్గర ఉంటే సిబిసిఐడి ద్వారా నిరూపించొచ్చు కదా అని ప్రశ్నించారు. స్కిల్ స్కాం డబ్బులు బాపట్లకు వచ్చాయనే ఆధారాలు ఆరోపించిన నాయకుడి దగ్గర ఏమైనా వున్నాయా అని ప్రశ్నించారు. నోరు వుంది కదా అని చంద్రబాబుపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఇసుక మాఫియాతో రూ.వందల కోట్లు సంపాదించిందెవరో ప్రజలందరికీ తెలుసని అన్నారు. రహదారుల విస్తరణలో భాగంగా భవన యజమానులకు బాండులు సకాలంలో ఇవ్వకుండా వ్యాపారస్తులను ఇబ్బందులు పెట్టారని అన్నారు. స్థలం కోల్పోయిన భవన యజమానులు ప్రశ్నిస్తే వారి స్థలంలో రోడ్డును వంకర్లు తిప్పేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. డ్రైనేజిని అస్తవ్యస్థం చేశారని అన్నారు. వైద్య కళాశాల శంకుస్థాపన చేసిన రోజు 2024కల్లా కళాశాలను పూర్తి విద్యార్థులకు  అడ్మిషన్లు ప్రారంభిస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని అన్నారు. మెడికల్ కాలేజ్ పనులు ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలని అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రిలే నిరాహార దీక్షలకు, ర్యాలీకి టిడిపికి అనుమతుల్లేవని అంటున్న పోలీసులకు ఆదివారం  వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో నిర్వహించిన సమావేశానికి 30పోలీస్ యాక్ట్ ఎందుకు వర్తించలేదని ప్రశ్నించారు. గడచిన నాలుగున్నరేళ్లలో  అధికారపక్షం నాయకులు ఏమేమి తప్పులు చేసారో తన దగ్గర పూర్తి అధారాలు వున్నాయని అన్నారు. దీనిపై బహిరంగ చర్చకు  సిద్ధమేనా అని అన్నారు. సమావేశంలో టిడిపి నాయకులు సలగల రాజశేఖర బాబు, గొలపల శ్రీనివాసరావు, ఏపూరి భూపతిరావు, ఆంధ్రెయ, భవనం బసివిరెడ్డి, దయాబాబు, బొద్దుకూరి విజయ, గోపాపురం సంధ్య, మోదుగుల శంకరరెడ్డి, అప్జల్  పాల్గొన్నారు.