Aug 10,2023 23:11

మాట్లాడుతున్న మాజీ సిఎం చంద్రబాబునాయుడు

* ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయారు
* సుజల స్రవంతిని పూర్తి చేసి జిల్లాకు గోదావరి జలాలు
* నదీ జలాలను వినియోగించుకుని జిల్లాను సస్యశ్యామలం చేస్తాం
* జిల్లాల పునర్విభజనను సరిదిద్దుతాం
* టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి / కొత్తూరు / ఆమదాలవలస: 
వైసిపి పాలనలో ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరిలో భాగంగా హిరమండలంలోని వంశధార ప్రాజెక్టు, సరుబుజ్జిలి మండలం చిగురువలసలో వంశధార-నాగావళి అనుసంధాన పనులను గురువారం పరిశీలించారు. అనంతరం కొత్తూరులో బహిరంగ సభలో ప్రసంగించారు. రెండు జిల్లాలకు రెండు లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే తోటపల్లి ప్రాజెక్టుకు కాలువను కూడా ఈ ప్రభుత్వం నిర్మించలేకపోయిందన్నారు. వైసిపి నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. రెండు జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులకు టిడిపి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో, వైసిపి ఎంత వెచ్చించిందో రెండు జిల్లాలకు చెందిన మంత్రులు చెప్పాలని సవాల్‌ విసిరారు. జిల్లాలో వంశధార, నాగావళితో పాటు ఇతర చిన్న నదులున్నాయని, వాటిని వినియోగించుకుంటే జిల్లాను సస్యశ్యామలం చేయొచ్చన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేసి, పోలవరం ద్వారా గోదావరి జలాలను తీసుకొస్తామని చెప్పారు. వంశధార, నాగావళి అనుసంధాన పనులను పూర్తి చేస్తామని తెలిపారు. వంశధార నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తామని మోసం చేశారని విమర్శించారు. ఈ చట్టం అమలు చేస్తే ఎకరాకు రూ.19 లక్షలు, ఆర్‌ అండ్‌ ఆర్‌కు రూ.12 లక్షలు ఇవ్వాలని, అంత ఎవరికైనా అందిందా అని ప్రశ్నించారు.
వాలంటీర్లతో తప్పుడు పనులు
కరెంటు ఛార్జీలు పెంచి ప్రభుత్వం ప్రజలపై తీవ్ర భారం మోపుతోందని విమర్శించారు. జల, పవన, సోలార్‌ వంటి ప్రత్యామ్నాయ పద్ధతుల్లో కరెంటును ఉత్పత్తి చేస్తే విద్యుత్‌ ఛార్జీలను పెంచాల్సిన అవసరం లేదని చెప్పారు. వైసిపి ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, రూ.ఐదు వేల వేతనంతో వాలంటీర్లను నియమించి వారితో తప్పుడు పనులు చేయిస్తోందన్నారు. టిడిపి అధికారంలోకొస్తే యువగళం ద్వారా రూ.మూడు వేల భృతి ఇస్తామని తెలిపారు.
జిల్లాల పునర్విభజనను సరిదిద్దుతాం
తాము అధికారంలోకొస్తే పాతపట్నం నియోజకవర్గం, కొత్తూరు మండలానికి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. టిడిపి హయాంలో కొత్తూరుకు కేటాయించిన సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రిని ఎత్తేసే పరిస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు. కొత్తూరు రూ.35 కోట్లతో తాగునీటికి నిధులు కేటాయిస్తే, అదీ అతీగతి లేకుండా పోయిందన్నారు. నియోజకవర్గంలో ఎక్కడైనా సిసి రోడ్లు, ఎత్తిపోతల పథకాలు నిర్మించారా అని ప్రశ్నించారు. గిరిజనులకు తాము అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ వైసిపి ప్రభుత్వం రద్దు చేసిందని ధ్వజమెత్తారు. భామిని మండలాన్ని శ్రీకాకుళం జిల్లాలో కలపాలని ఆ మండలానికి చెందిన నాయకులు, ప్రజలు కోరిన విషయాన్ని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు చంద్రబాబు దృష్టికి తీసుకురాగా, అధికారంలోకి వస్తే కలుపుతామన్నారు. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అస్తవ్యస్తంగా చేసిన జిల్లాల పునర్విభజనను సరిదిద్దే బాధ్యతను తీసుకుంటామని చెప్పారు.
ప్రాజెక్టుల సందర్శన
తొలుత ఆయన సరుబుజ్జిలి మండలంలోని చిగురువలసలో వంశధార-నాగావళి అనుసంధాన పనులను పరిశీలించారు. అక్కడ దళితులు ప్లకార్డులు పట్టుకుని నిల్చోవడాన్ని గమనించిన చంద్రబాబు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనుసంధాన ప్రాజెక్టుకు డి-పట్టా భూములు తీసుకున్న ప్రభుత్వం, ఇప్పటివరకు తమకు పరిహారం చెల్లించలేదని చంద్రబాబుకు చెప్పారు. దీనిపై న్యాయం చేస్తామని ఆయన హామీనిచ్చారు. అనంతరం హిరమండలంలోని వంశధార రిజర్వాయర్‌ పనులను పరిశీలించారు. అక్కడ సెల్ఫీ తీసుకున్నారు. వంశధార పనుల పరిస్థితిని వంశధార ఇంజినీరింగ్‌ అధికారులు ఆయనకు వివరించారు.
జన నీరాజనం
చంద్రబాబుకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. బూర్జ మండలం పాలవలస, కొత్తూరు మండలం పారాపురం వద్ద అభిమానులు, కార్యకర్తలు గజమాలతో సత్కరించారు. పారాపురం నుంచి కొత్తూరు నాలుగు రోడ్ల కూడలి వరకు సాగిన రోడ్‌షోలో మహిళలు పూలు చల్లారు. చంద్రబాబు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, మాజీ మంత్రులు నిమ్మకాయల చిన్నరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు, కిమిడి కళావెంకట్రావు, టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, పాతపట్నం, శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు కలమట వెంకటరమణ, గుండ లకీëదేవి, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.