Jul 20,2022 00:35

ఎర్రమట్టిదిబ్బల వద్ద టిడిపి ఆందోళన

ప్రజాశక్తి -భీమునిపట్నం : వైసిపి పాలనలో ఇసుక, మట్టి, గ్రావెల్‌ ఇలా సహజ వనరుల దోపిడీ జరుగుతోందని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు ఆరోపించారు. జివిఎంసి నాలుగో వార్డు పరిధి బీచ్‌ రోడ్డు ఎర్రమట్టిదిబ్బల వద్ద పార్టీ నియోజక వర్గ కమిటీ ఆధ్వర్యాన మంగళవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కోరాడ రాజబాబు మాట్లాడుతూ, ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా ఉన్న ఎర్ర మట్టి దిబ్బలను కూడా వైసిపి నాయకులు వదలట్లేదని, ఎర్రమట్టిని సైతం తరలించుకు పోతున్నారని విమర్శించారు. విదేశీ పర్యాటకులు మెచ్చే రుషికొండను ధ్వంసం చేశారని ఆరోపించారు. సహజ వనరులను దోపిడీ చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మూడో డివిజన్‌ అధ్యక్షులు గంటా నూకరాజు, నగర కార్యదర్శి పిట్ట సురేష్‌, జెడ్‌పిటిసి మాజీ సభ్యులు సరగడ అప్పారావు, పార్టీ నాయకులు గిడుతూరి శ్రీనివాసరావు, పాసి త్రినాధ్‌కుమార్‌, పార్టీ పద్మనాభం మండల అధ్యక్షులు కోరాడ రమణ, నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షులు బోయి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.