ప్రజాశక్తి-అనకాపల్లి
వైసిపి పాలనలో ప్రజలపై రూ.42 వేల కోట్ల మేరకు విద్యుత్ ఛార్జీలు మోపారని టిడిపి అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు అన్నారు. స్థానిక టిడిపి పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో శనివారం టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోగడల కృష్ణ, మాడుగుల నియోజకవర్గం ఇన్‌ఛార్జి పివిజి.కుమార్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ సరాసరి వినియోగాన్ని బట్టి కేటగరైజేషన్ విధానాన్ని రద్దు చేసి, నెలవారీ వాడకం ఆధారంగా కేటగిరి నిర్ణయించే నూతన విధానాన్ని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. దీంతో పేద మధ్యతరగతి ప్రజలపై ఎన్నడూ లేనంత భారం పడిందన్నారు. 400 యూనిట్లు పైబడి వినియోగించే సంపన్న వర్గాలకు కేవలం ఆరు శాతం పెంచి, 125 యూనిట్లు లోపు వాడే పేద వర్గాలపై 57 విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణమన్నారు. ప్రభుత్వం మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్తు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు ప్రజలకు సరఫరా చేస్తోందన్నారు. సంక్షేమం ముసుగులో ప్రజల నుంచి దోచుకుంటుందని విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఐదేళ్లపాటు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్తు 24 గంటలు సరఫరా చేశారని గుర్తు చేశారు. జగన్‌రెడ్డి గారిడీలను ప్రజలు గమనిస్తున్నారని, ఈ ప్రభుత్వాన్ని బంగాళా ఖాతంలో కలపడం ఖాయమని హెచ్చరించారు.










