Nov 01,2023 20:52

గుమ్మలక్ష్మీపురం: ఇంటింటికి ప్రచారం చేస్తున్న జగదీశ్వరి

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : వైసిపి నాలుగున్నర ఏళ్ల పాలనలో ప్రజలకు కష్టాలే మిగిలాయి తప్ప అభివృద్ధి ఎక్కడా కానరాలేదని కురుపాం నియోజకవర్గం టిడిపి ఇంచార్జి తోయక జగదీశ్వరి అన్నారు. జియ్యమ్మవలస మండలం తాళ్లడుమ్మ పంచాయతీ చంద్రశేరరాజుపురంలో టిడిపి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి టిడిపి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలు అమలతో ఇచ్చింది గోరంతైతే ప్రజల నుంచి దోచుకున్నది కొండంత అని విమర్శించారు. ధరలు పెరుగుదలతో ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల కష్టాలు తీరాలంటే 2024లో టిడిపి అధికారంలోకి రావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, నాయకులు నందివాడ కృష్ణబాబు, రెడ్డి బలరాం స్వామి నాయుడు, వెంపటాపు భారతి, లంక గోపాలం, జనసేన నాయకులు దత్తి శంకర్‌రావు, దత్తి నరేష్‌ నాయుడు, తాడేల శ్రీరామ్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల సందర్భంగా మండలంలోని డుమ్మంగి పంచాయతీ టెంకసింగి, కొత్తగూడ గ్రామాల్లో టిడిపి సీనియర్‌ నాయకులు బిడ్డిక పద్మావతి ఆధ్వర్యంలో గిరిజనులు సంబరాలు జరుపుకున్నారు. టిడిపితోనే గిరిజన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గిరిజన బతుకులు బాగుపడాలంటే 2024 ఎన్నికల్లో నిజమైన గిరిజన అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.
జజ్జువలో టిడిపి ప్రజా వేదిక
సీతంపేట: మండలంలోని వజ్జాయిగూడ పంచాయతీ పరిధిలో గల జాజ్జువలో పాలకొండ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు ఆధ్వర్యాన బుధవారం ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జయకృష్ణ మాట్లాడుతూ రాబోయేది టిడిపి ప్రభుత్వమని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకి నెలకు రూ.1500 అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నిమ్మక చంద్రశేఖర్‌, క్లస్టర్‌ ఇంచార్జ్‌ ఐటీడీపి కోఆర్డినేటర్‌ హిమరక పవన్‌, ప్రచారకర్త తోయిక సంధ్యారాణి, పలువురు నాయకులు, పాల్గొన్నారు. సీతానగరం: మండలంలోని చినంకలాం గ్రామ సర్పంచ్‌ పోలా అప్పల నరసమ్మ, మాజీ సర్పంచ్‌ పోలా తిరుపతిరావు దంపతులతో పాటు 150 కుటుంబాలు టిడిపిలో బుధవారం చేరాయి. టిడిపి ఇంఛార్జి బోనుల విజరు చంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అరాచకాలు పెరగడంతో చాలా మంది టిడిపి వైపు మొగ్గుచూపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్‌,నాయకులు సత్యనారాయణ, కొల్లి తిరుపతిరావు, వేణుగోపాల నాయుడు,పెంకు వేణుగోపాలనాయుడు, గొట్టాపు వెంకట్‌ నాయుడు, ధర్నాల సీతారాం, కోరాడ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.