ప్రజాశక్తి-రేపల్లె : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పడకేసిందని జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రాతంశెట్టి మహేష్ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసిపి పాలన నాలుగేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా బైకు ర్యాలీలు ఎందుకని ప్రశ్నించారు. ఎం సాధించారని బైకులు నిర్వహిస్తున్నారో చెపాల్పన్నారు. 2019 ఎన్నిక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 98 శాతం అమలు చేసామంటూ అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రానికి రాజధాని అమరావతి లేకుండా చేసి, మూడు రాజధానులంటూ రాజధాని లేని రాష్ట్రంగా చేసినందుకు ర్యాలీలు చేస్తున్నారా అని ఆయన ఎద్దేవ చేశారు. ఇసుక కొరతను సష్టించి భవన నిర్మాణ రంగం కార్మికుల జీవితాలతో ఆడుకున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని రివర్స్ టెండర్లను వేసి ఎందుకు పూర్త చేయలేదో చెప్పాలన్నారు. నిరుద్యోగుల కోసం ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీలు గుప్పించ్చి, మోసం చేయలేదా అని ప్రశ్నించారు. నిత్యావసరాల ధరలు, విద్యుత్ ఛార్జీలు,ఇంటి పన్నులు, చెత్త పన్నులు, ఆర్‌టిసి ఛార్జీలు పెంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సాయి, బత్తుల మల్లి, డి.గురు బ్రహ్మం డి.రాజశేఖర్, కె.రవి కుమార్, పి.పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.










