Dec 07,2022 23:29

సమస్యలు తెలుసుకుంటున్న పివిజి కుమార్‌

ప్రజాశక్తి-అనకాపల్లి:వైసిపి ప్రభుత్వ అసమర్థ పాలనలో రాష్ట్రాభివృద్ధి అన్ని విధాలుగా కుంటుపడిందని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా బుధవారం చలో కలెక్టరేట్‌ నిర్వహించారు. కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించి డిఆర్‌ఓ వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి పాలనలో అంతా అవినీతి రాజ్యమేలుతుందన్నారు. అన్ని వర్గాలు ఆయన పాలనను ఛీదరించుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవింద సత్యనారాయణ, గవిరెడ్డి రామానాయుడు, కెఎస్‌ఎన్‌ఎస్‌.రాజు, వంగలపూడి అనిత, టిడిపి మాడుగుల ఇన్‌ఛార్జి పివిజి.కుమార్‌, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
జివిఎంసి 82వ వార్డు శ్రీరామ్‌నగర్‌ కాలనీ, మరిడిమాంబ నగర్‌ ప్రాంతాల్లో టిడిపి అర్బన్‌ జిల్లా కార్యదర్శి పోలవరపు త్రినాధ్‌ ఆధ్వర్యంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలపై కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిసి సాధికారత సమితి రాష్ట్ర కన్వీనర్‌ మళ్ల సురేంద్ర, టిడిపి నాయకులు కొణతాల రత్న కుమారి, పిట్ల రాజు పాల్గొన్నారు.
వైసిపి పాలనలో అభివృద్ధి శూన్యం
టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యురాలు అనిత
నక్కపల్లి:మండలంలోని నెల్లిపూడి గ్రామంలో బుధవారం తెలుగుదేశం పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో పర్యటించారు. వైసిపి పాలనలో ఎక్కడా అభివృద్ధి నోచు కోలేదన్నారు. ధరలన్నీ ఆకాశాన్ని అంటాయని, దీంతో పేదలు, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్‌, పార్టీ నాయకులు లాలం కాశీ నాయుడు, గింజాల లక్ష్మణరావు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
చీడికాడ:మండలంలోని తురువోలు గ్రామంలో ఎంపీటీసీ బీల కోటేశ్వరరావు, టిడిపి మండల అధ్యక్షుడు పోతుల చిన్నంనాయుడు ఆధ్వర్యాన 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా
మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు మాట్లాడుతూ, నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు కోటేశ్వరరావు, పైలా ముత్యాలనాయుడు, జి.కొత్తపల్లి సర్పంచ్‌ సూరి నాయుడు, కార్యకర్తలు పాత్రుని సురేష్‌, జగన్‌, శ్రీరామ్‌మూర్తి పాల్గొన్నారు.
పేదలకు అన్యాయం : కుమార్‌
మాడుగుల: పేదలను వైసీపీ ప్రభుత్వం విస్మరిస్తుందని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పివిజి కుమార్‌ విమర్శించారు. బుధవారం మండలంలోని తాటిపర్తి, గరికిబంధ గ్రామాలలో ఇదేం ఖర్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం హయాంలో పేదలకు సంపూర్ణ న్యాయం జరిగిందని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. అన్నా క్యాంటీన్‌ ద్వారా పేదలకు కడుపు నిండా తిండి దొరికేదని ప్రస్తుతం ఇటువంటి పథకాలు లేక పేదలు ఆకలితో అల్లాడుతున్నారన్నారు.ఈ కార్యక్రమంలో గొల్లబిల్లి శ్రీరామమూర్తి, జల్లి సూర్యప్రకాశరావు పాల్గొన్నారు.