వైసిపి పాలనలో ఎస్‌టిలకు అన్యాయం
ప్రజాశక్తి-కావలి : కావలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆదేశానుసారం టిడిపి కార్యాలయంలో శుక్రవారం రాష్ట్రంలో ''వైసిపి పాలనలో ఎస్‌టిలపై జరుగుతున్న అన్యాయాలపై'' రాష్ట్ర పార్టీ కార్యదర్శి మొగిలి కల్లయ్య ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మొగిలి కల్లయ్య మాట్లాడుతూ వైసిపి దారుణాలను అన్యాయాలను ప్రశ్నించిన టిడిపి ఎస్‌టిసెల్ రాష్ట్ర అధ్యక్షులు దారునాయక్ పై అన్యాయంగా పెట్టిన అక్రమ కేసులు తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గిరిజనులకు జరుగుతున్న అక్రమాలను, అన్యాయాలను అడిగిన వారిపై కేసులు నమోదు చేయడం ఏమిటని, ఆయన ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుగుతున్న ఎస్‌టి నాయకులపై ఎందుకు ఇంతకక్ష సాధింపు ధోరణిలో వైసిపి నాయకులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో చూసి, వైసిపి నాయకుల్లో భయం మొదలయిందన్నారు. రైతులు, మహిళలు, యువత, అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ మేనిఫెస్టోను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడుకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ఇటువంటి చర్యలను చేపడుతున్నారన్నారు. వైసిపి నాయకుల నీచ సంస్కృతికి ఇదే నిదర్శనమని తెలిపారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో సమస్యలు సృష్టిస్తూ, వైసిపి పాలనా పరమైన లోపంలో మునిగి పోయిందన్నారు. అనంతరం కావలి పట్టణ టిడిపి ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు మాట్లాడుతూ ఎస్‌సి ఎస్‌టిలను చంపి తింటున్న సంస్కృతిని జగన్మోహన్ రెడ్డి స్థాపించారని, ఇటువంటి చర్యలను ఇకనైనా ఆపాలని, లేకుంటే టిడిపి చేపట్టబోయే కార్యక్రమాలకు పూర్తి బాధ్యత వైసిపి నాయకులే వహించవలసి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో కావలి రూరల్ మండలం ఎస్‌టి విభాగం అధ్యక్షులు పేరం రవిబాబు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పూడిపర్తి మురళి, 16వవార్డు పార్టీ ప్రధానకార్యదర్శి మొగిలి విజయకుమార్, గిరిజన నాయకులు పాలకుర్తి బాలరాజు, పార్టీ నాయకులు కోవూరు వెంకటనారాయణ, కోవూరు సునీల్, వేణు, వెంకట్రావు పాల్గొన్నారు.










