Sep 06,2023 20:46

మాట్లాడుతున్న మంత్రి కాకాణి

మాట్లాడుతున్న మంత్రి కాకాణి
వైసిపి పాలనలో ఐదేళ్లూ వర్షాలే...!
-రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
ప్రజాశక్తి-నెల్లూరు :రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వర్షాలు కురుస్తున్నాయని, పంటల దిగుబడి బాగా పెరిగిందని, ఇది చూసి ఓర్వలేని ఓ పత్రిక రాష్ట్రంలో కరువు మండలాల జాబితా ప్రకటించాలని కోరడం విడ్డూరంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రంలో కరువు మండలాలను ప్రకటింపచేసి , గతంలో టిడిపి ప్రభుత్వ పాలనతో సమానంగా ఈ ప్రభుత్వం పాలన సాగిస్తుందని ప్రజలకు చెప్పుకోవాలని ప్రయత్నించడం దారుణమన్నారు.సాధారణంగా సెప్టెంబర్‌ నెలాఖరునాటికి ఉన్న వర్షపాతాన్ని చూసి.. డిజాస్టర్‌మేనేజ్‌మెంట్‌ అంచనాలతో సరిచూసుకుని కరువు పరిస్థితిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందుతాయని, అవసరాన్ని బట్టి కరువు మండలాల ప్రకటన ప్రభుత్వం చేస్తుందన్నారు. నాలుగేళ్లు వరుసగా వర్షాలు బాగా కురిశాయి. ఐదో ఏడు అంటే ఇప్పుడు కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టాయి..
చంద్రబాబు పర్యటనల పేరుతో ఊళ్లకొస్తుంటే వరుణదేవుడు మొఖం చాటేస్తున్నాడయ్యా అని రైతులే చెబుతున్నారన్నారు. ఈ రాష్ట్రానికి అరిష్టం ఏంటంటే చంద్రబాబు దరిద్ర పాదమనే చెప్పాలన్నారు. మొన్న ఢిల్లీ వెళ్ళొచ్చాడు. భారతదేశం మొత్తం కరువు వచ్చే పరిస్థితినెలకొన్నదని ఎద్దేవా చేశౄరు. చంద్రబాబు విపరీతమైన ఫ్రస్టేషన్‌ లోకి వెళ్లారని, ప్రస్తుతం ఐటీ నోటీసుల నుంచి బయటపడడానికి రకరకాల కథలు అల్లుతున్నారన్నారు. కొన్ని పత్రికలు చంద్రబాబు నోటీసులు గురించి రాయకుండా, మాట్లాడకుండా కప్పిపుచ్చడానికి ఏదో రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, వైసిపి ప్రభుత్వం మీద, మైండ్‌ గేమ్‌ ఆడుతుందన్నారు. మన రాష్ట్రంలోని పథకాలు బ్రహ్మాండమైనవి అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ చెప్పడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మార్గదర్శి చిట్‌ ఫండ్‌ మరో శారద చిట్‌ ఫండ్‌ కన్నా దారుణంగా తయారయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రజల దగ్గర డిపాజిట్‌ చేయించుకుని బదలాయించుకుని బోర్డు ఎత్తేస్తే డిపాజిట్‌ దారులు వీధిన పడే పరిస్థితి రాకుండా ఆ ప్రమాదాన్ని పసికట్టి ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకుందన్నారు. దానిని చూసి తట్టుకోలేక దారుణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తా కథనాలు రాయడం సరికాదన్నారు. రైతుల అవసరాల్ని దష్టిలో ఉంచుకుని.. ఎప్పటికప్పుడు వారి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నదని వైసిపి ప్రభుత్వమన్నారు. ఏ ఒక్కరోజూ రైతులను, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి చంద్రబాబు మాదిరిగా దండగమారి పనులని మేము చెప్పుకోలేదన్నారు. రైతు పంట వేసే దగ్గర్నుంచి విత్తునాటి, కలుపు పనులకు అవసరమైన పనిముట్లు, ఎరువులు, పురుగుమందులు పంపిణీ, ట్రాక్టర్లుతో పాటు సకాలంలో నీళ్లు అందిస్తూ.. పంటదిగుబడి చేతికొచ్చాక గిట్టుబాటు ధర అందేలా పాలన సాగిస్తున్నామన్నారు.