కదిరి టౌన్ : రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చాక అస్తవ్యస్త పాలన కొనసాగుతోందని, దీని వల్ల అన్ని వర్గాల ప్రజలూ ఇబ్బందుకలు గురవుతున్నారని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్ విమర్శించారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును విడుదల చేయాలని కోరుతూ కదిరి పట్టణంలో చేపట్టిన నిరసన దీక్షలో కొనసాగుతున్నాయి. సోమవారం నాడు బలిజ సంఘం నాయకులు రిలేనిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా కందికుంట మాట్లాడుతూ చంద్రబాబు నాయుడును రాజకీయ కక్షతోనే అక్రమ కేసుల్లో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇరికించిందన్నారు. వైసిపి అనాలోచిత విధానాలతో ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. బలిజ కులస్తులు ఆర్థికంగా, సామాజికంగా వెనకబడి ఉన్నారన్నారు. వైసిపి ప్రభుత్వం బలిజలకు ఎలాంటి సాయం అందించడం లేదన్నారు. గతంలో టిడిపి హయాంలో కాపు కార్పొరేషన్ ద్వారా ఎంతోమందికి సబ్సిడీ రుణాల మంజూరు చేశామని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక వాటిని తుంగలో తొక్కిందని విమర్శించారు. కదిరి నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న బలిజ కులస్తుల కోసం కళ్యాణ మండపాన్ని కట్టిస్తానని కందికుంట హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కదిరి నియోజకవర్గ బలిజ కులస్తులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










