ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు నాలుగు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో స్థానిక అభీద్ సెంటర్లో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ జి.ఆదిలక్ష్మి, వైసీపీ నాయకులు కేకును కట్ చేసి పంచారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఏ మాట్లాడుతూ, సుమారు నాలుగు సంవత్సరాల క్రితం ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసారన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా రాజకీయాలు చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తామని మాట ఇచ్చినట్లుగానే అమలు చేస్తున్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాల ఇస్తున్నారని తెలిపారు. మరో ముప్పై సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటారని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గొలుసు నర్శింహమూర్తి, కౌన్సిలర్‌లు తమరాన నాయుడు, కోనేటి రామకృష్ణ, ఆరుగుల్లు రాజబాబు, గుడిబండి నాగేశ్వరరావు, పాల్గొన్నారు.
రోలుగుంట:ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మండలంలోని కొవ్వూరులో ఎంపిపి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి యర్రంశెట్టి శ్రీనివాసరావు, సర్పంచ్ కాంతమ్మ, రాజారావు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.
దేవరాపల్లి
ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకునిగా చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయమని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. ప్రజా సంకల్ప యాత్ర ముగింపునకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా మండలంలోని చిన గంగవరంలో సోమవారం డిప్యూటీ సిఎం బూడి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి కిలపర్తి భాస్కరరావు, పార్టీ అధ్యక్షులు బాబురావు పాల్గొన్నారు.
అచ్యుతాపురం : ప్రజా సంకల్ప యాత్రకు నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మండలంలోని చోడపల్లి సచివాలయం వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే యువి.రమణమూర్తిరాజు పాలాభిషేకం చేసి, కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ యు.సుకుమార్ వర్మ, వైసిపి మండల అధ్యక్షులు దేశంశెట్టి శంకర్రావు, సీనియర్ నాయకుడు కోన బుజ్జి, ఒడిసిల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
వడ్డాది : ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా జెడ్పిటిసి దొండా రాంబాబు బుచ్చయ్యపేట మండలం బంగారు మెట్ట, వడ్డాది జంక్షన్లో రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దొండా లలిత నారాయణమూర్తి, కొలిమల అచ్చం నాయుడు, దొండా సన్యాసిరావు, సాయం రమేష్, తమరాన వెంకటరమణ, యనమల వాసు పాల్గొన్నారు.










