ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ వైసిపి నేతల మెప్పుకోసమే గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో పేదలు వేసుకున్న గుడిసెలను తొలగించారని గుడిసెలు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్ ధ్వజమెత్తారు. కల్లూరులో పేదల గుడిసెలు తొలగించడాన్ని నిరసిస్తూ గురువారం నగరంలోని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. విషయం తెలుసుకున్న అసిస్టెంట్ కమిషన్ ఆదిశేషనాయుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నాయకులు, కార్యకర్తలు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు సర్ధిచెప్పారు. దీంతో అక్కడే బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ భూముల్లో వేసుకున్న గుడిసెలు తొలగించామని ప్రకటించిన ఆదిశేషునాయుడుకు అదే సర్వే నెంబర్‌లో 32 ఎకరాలు ఆక్రమణకు గురైన విషయం కనిపించడం లేదా.. అని ప్రశ్నించారు. కల్లూరు గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన బోర్డులో 2007 నుంచి 17.5 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు వాసుకున్న విషయాన్ని మన్నన చేసుకోవాలన్నారు. వాటిని తొలగించకుండా పేదలు వేసుకున్న గుడిసెలు కూల్చివేయడం వెనుక ఎంత వాటా ఉందని ప్రశ్నించారు. ఆలయ ధర్మకర్తగా చలామణి అవుతున్న వైసిపి నాయకులు కూల్చివేసిన గుడిసెల పక్కనే 1.5 ఎకరాల భూమిని ఆక్రమించుకుని ప్లాట్స్ వేసి అమ్ముకుంటున్న విషయం సహాయ కమిషనర్‌కు కనిపించడం లేదా.. అన్నారు. ఇందుకు ఎంత ముట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కమిషనర్ ఎక్కడున్నా కార్యాలయానికి వచ్చి సమాధానం చెప్పాలని సిపిఎం నేతలు పట్టుబట్టారు. పోలీసు అధికారులు, దేవాదాయ శాఖ కార్యాలయం సిబ్బందితో పలుమార్లు చర్చలు జరిపి నేడు అసిస్టెంట్ కమిషనర్‌తో కలిపించి మాట్లాడిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.నాగేంద్ర, జిల్లా కమిటీ సభ్యులు తరిమెల నాగరాజు, వి.రామిరెడ్డి, ఆర్‌వి.నాయుడు, క్రిష్ణమూర్తి, భాస్కర్, మండల కార్యదర్శి చెన్నారెడ్డి, మండల నాయకులు నల్లప్ప, శంకర, ఓబులేసు, రాముడు, లక్ష్మీదేవి, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
దేవాదాయ శాఖ ఎసి కార్యాలయం ముట్టడించిన సిపిఎం










