Feb 25,2023 23:57

పోలీసు స్టేషన్‌ ఎదుట సచివాలయ ఉద్యోగులు

ప్రజాశక్తి- చోడవరం
మండలంలో అడ్డూరు గ్రామ సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ బి.సతీష్‌పై వైసిపి నాయకులు ఎలమంచిలి పోతినాయుడు దాడి చేయడంపై సచివాలయ ఉద్యోగులు శనివారం ఎంపిడిఒ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. దీనికి ముందు పోతి నాయుడుపై కేసు నమోదు చేయాలని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సచివాలయ ఉద్యోగుల నిరసనకు ఏపీ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య నాయకులు ఆర్‌. శంకర్రావు, సిఐటియు జిల్లా నాయకులు వివి శ్రీనివాసరావు, ఎస్‌వి.నాయుడు సంఘీభావం తెలిపారు. వైసిపి నేత దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌పై వైసిపి నేత పోతినాయుడు సచివాలయ ఉద్యోగులు, గ్రామ పెద్దలు, వైసిపి నాయకులు ఉండగానే సచివాలయంలోనే దాడి చేయడం దుర్మార్గమన్నారు. ఉన్నత చదువులు చదువుకొని, సచివాలయ ఉద్యోగులుగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్న వారిపై అధికార పార్టీ నాయకులు దాడులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కనీస భద్రత కల్పించకపోవడం అన్యాయమన్నారు. ఈ సంఘటనపై వెంటనే విచారం జరిపించి దాడి చేసిన వైసిపి నాయకుడు పోతినాయుడును అరెస్టు చేయాలని, సచివాలయ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే జిల్లా వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.